Begin typing your search above and press return to search.

డ్రింకింగ్ ల‌వ‌ర్స్‌ కి బ్యాడ్ న్యూస్ బాస్‌

By:  Tupaki Desk   |   3 May 2016 1:27 PM GMT
డ్రింకింగ్ ల‌వ‌ర్స్‌ కి బ్యాడ్ న్యూస్ బాస్‌
X
మ‌ద్యం ప్రియుల‌కు చిన్న బ్యాడ్ న్యూస్. ఏంట‌ది అస‌లే వేస‌విలో చ‌ల్ల‌టి బీర్‌ ల‌తో చిల్ అవుదామనుకుంటే ఇప్పుడేం బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా? డ‌్రింకింగ్‌ పై ప‌రిమితి ఏం పెట్ట‌ట్లేదు కానీ... బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు మాత్రం తాగ‌కుండా క‌ట్ట‌డి చేసే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎప్ప‌ట్లాగానే ప్ర‌జాసంక్షేమం కోణం కూడా ఉందండోయ్‌!

ఇంత‌కీ పాయింట్ ఏంటంటే.... తప్పతాగి వాహనాలు నడపడం వల్లే గత ఐదేళ్లలో 1,18,840 మంది మృతి చెందారని లెక్క‌లు తేల్చాయి. ఈ విధంగా దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున దీనికి చెక్‌పెట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. హైవేల వెంబడి మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు - ప్రిన్సిపల్ సెక్రెటరీలు - రవాణా కార్యదర్శులు - కేంద్ర పాలిత ప్రాంత అధికారులను ఆదేశించామ‌ని కేంద్ర రవాణ - హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

డ్రంకన్ డ్రైవింగ్‌ను కట్టుదిట్టం చేయడం - ఎక్సయిజ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్రాలకు గ‌డ్క‌రీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్రీత్ అనలైజర్లు తమ మంత్రిత్వశాఖ సమకూర్చుతుందని గడ్కరీ వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే 1988 మోటర్ వెహికల్స్ చట్టంలోని 185 సెక్షన్ కింద కఠిన శిక్షలు లేదా జరిమానా విధిస్తారని తెలిపారు. సో...ఇక‌నుంచి దాబాల్లోనో...హైవే బార్ల‌లోనో ధూంధాం చేసే చాన్స్ లేన‌ట్లే!!