Begin typing your search above and press return to search.

టీడీపీలో టికెట్లు రాని వారే!.. వైసీపీలోకి వ‌స్తున్నారా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 10:19 AM GMT
టీడీపీలో టికెట్లు రాని వారే!.. వైసీపీలోకి వ‌స్తున్నారా?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు రాష్ట్రంలో చాలా విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. అధికార పార్టీలోకి వ‌స‌ల‌కు బ‌దులుగా ఆ పార్టీ నుంచే విప‌క్షంలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మైపోయాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీలు - ఇద్ద‌రు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. వీరిలో ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ - విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్‌ లను ప‌క్క‌న‌పెడితే... ఈ వ‌ల‌స‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డిని టీడీపీనే స్వ‌యంగా బ‌హిష్క‌రించేసినంత ప‌ని చేసింది. పొమ్మ‌న‌లేక పొగ పెట్టేసిందన్న విమ‌ర్శ‌లూ వెల్లువెత్తాయి. టీడీపీని వీడే ఉద్దేశం ఏ కోశానా లేని మేడా... చేసేది లేక చివ‌ర‌కు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే మేడా చేరిక సంద‌ర్భంగా తామేదో ఘ‌న‌త సాధించామ‌న్న రీతిలో వైసీపీ నేత‌లు కొంద‌రు వ్య‌వ‌హ‌రించారు. ఇక నేటి ఉద‌యం టీడీపీకి రాజీనామా చేసిన నేరుగా లోటస్ పాండ్ లో ప్ర‌త్య‌క్ష‌మైన తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు కూడా వైసీపీలో చేరిపోయారు. మేడాకు స్వాగ‌తం ప‌లికిన మాదిరే పండుల‌కు కూడా జ‌గ‌న్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. పండుల వెంట వ‌చ్చిన ఆయ‌న అనుచ‌రుల‌కు కూడా స్వ‌యంగా కండువాలు క‌ప్పిన జ‌గ‌న్‌... వారంద‌రినీ పార్టీలోకి సాద‌రంగా స్వాగ‌తించారు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీలో టికెట్ ద‌క్క‌ద‌న్న విషయాన్ని తెలుసుకున్న మీద‌టే పండుల వైసీపీలోకి చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా ఇప్పుడు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో పండుల ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని - ఈ ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చుకోవ‌డంతో పాటుగా పార్టీ విజ‌యావ‌కాశాల‌ను మెరుగుప‌రిచే దిశ‌గా పండుల చ‌ర్య‌లు చేప‌ట్టిన దాఖ‌లాలే క‌నిపించ‌లేద‌ట‌. ఇదే విష‌యంపై ప‌లుమార్లు పండుల‌ను పార్టీ అధిష్ఠానం హెచ్చ‌రించినా కూడా ఆయ‌న స్పందించిన దాఖ‌లానే లేద‌ట‌. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇస్తాన‌ని చెబుతున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు.... పండుల‌కు కూడా ఇదే మాట చెప్పార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఓట‌మిని అంగీక‌రించేది లేద‌ని - ఓడిపోయే ఛాన్సు ఉన్న మీ లాంటి అభ్య‌ర్థికి మ‌రోమారు టికెట్ కూడా ఇచ్చేది లేద‌ని పండుల‌కు తెగేసి చెప్పార‌ట‌. దీంతో అప్ప‌టిక‌ప్పుడు త‌న మిత్రుడు - అప్ప‌టికే వైసీపీలోకి చేరిపోయిన అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీ‌నివాస్‌ కు విష‌యం చెప్పి... వైసీపీలోకి ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నార‌ట‌.

అయినా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల్లో మంచి మైలేజీ సంపాదించుకున్న జ‌గ‌న్ ఈ త‌ర‌హా నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న కొత్త వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల టికెట్ల‌ను ఆశిస్తున్న నేత‌లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో టీడీపీ తిర‌స్క‌రించిన నేత‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌ర‌చ‌డం, వారికే టికెట్లంటూ అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించ‌డం - పార్టీలోకి చేర్చుకోవ‌డం.... త‌దిత‌ర చ‌ర్య‌ల వ‌ల్ల పార్టీ శ్రేణుల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ‌తాయ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ గానీ - వైసీపీలోని కీల‌క నేత‌లు గానీ ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పాలి. అంతేకాకుండా ప్ర‌జాద‌ర‌ణ లేద‌ని టీడీపీ తేల్చేసిన నేత‌ల‌ను చేర్చుకుని ఆయా స్థానాల్లో వైసీపీని ఎలా విజ‌య‌తీరాల‌కు చేర్చుతార‌న్న విష‌యంపై ఇప్పుడు పార్టీలో కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదేమైనా పార్టీలోకి చేరేందుకు వ‌స్తున్న నేత‌ల వాస్త‌వ స్థితిగ‌తుల‌ను ప‌రిశీలించి చాలా జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.