Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై సానుభూతి లేదు - అనుమానాలే!

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:53 AM GMT
చంద్రబాబుపై సానుభూతి లేదు - అనుమానాలే!
X
సాధారణంగా ఇలాంటి రాజకీయాలు జరిగినప్పుడు బాధిత రాజకీయ పార్టీపై సానుభూతి కలుగుతూ ఉంటుంది. ఫిరాయింపు రాజకీయాల్లో చేర్చుకున్న పార్టీపై విమర్శలు రావడం, పార్టీ మారిన వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం - నేతలను కోల్పోయిన పార్టీ పై సానుభూతి కలగడం మామూలే. సాధారణ నేతలు పార్టీలు మారితే అదేం పెద్ద ఇష్యూ కాదు కానీ - ఎమ్మెల్యే- ఎంపీ వంటి హోదాల్లో ఉన్న నేతలు పార్టీ మారితేనే ప్రజలు వారిని అసహ్యించుకుంటారు. వారిని కోల్పోయిన పార్టీపై సానుభూతి వ్యక్తం చేస్తారు.

అయితే నలుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించిన వ్యవహారంలో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం. పార్టీ మారిన నలుగురు ఫిరాయింపుదారుల విషయంలో తెలుగుదేశం పార్టీపై సానుభూతి కలగకపోగా.. ఆ పార్టీ మీదే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం.

ఆ నలుగురినీ చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపించారు, తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు వారిని ఫిరాయింపజేశారు అనే టాక్ ప్రజల్లో వినిపిస్తూ ఉంది. ఇలాంటి జిత్తులు చంద్రబాబుకు కొత్త ఏమీ కాదని.. ఆయనకు ఇలాంటి వ్యూహాలు అలవాటే అని ప్రజలు చర్చించుకుంటూ ఉండటం గమనార్హం!

అవినీతి ఆరోపణలు - కేసుల చిక్కులు వంటి ఉండటంతో.. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన మనుషులను బీజేపీలోకి ప్రవేశ పెట్టారనే అభిప్రాయాలే అంతటా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కథ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాము ఎంపీలను బీజేపీలోకి పంపినట్టుగా జరుగుతున్న ప్రచారం అబద్ధమని తెలుగుదేశం వివరణ ఇచ్చుకుంటోంది.

ఇదే విచిత్రం. ఎంపీలను తెలుగుదేశం పార్టీ నష్టపోయినా - అనుమానాలు మాత్రం చంద్రబాబే మీదే కలుగుతూ ఉన్నాయి. ఇది వరకూ చంద్రబాబు నాయుడుకు ఇలాంటి రాజకీయాలు చేసిన చరిత్ర ఉండటంతో ఈ అభిప్రాయాలకు బలం చేకూరుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.