Begin typing your search above and press return to search.

భారత ప్రభుత్వం కూడా ఫాలో అవుతోందట!

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:50 AM GMT
భారత ప్రభుత్వం కూడా ఫాలో అవుతోందట!
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఊరికే ఆడిపోసుకుంటారు కానీ.. ఆయన అనుసరించే విధానాల్ని చాలామంది పాటిస్తుంటారు. దురదృష్టం కొద్దీ లేనిపోని ప్రచారాలు.. ఎటకారాలు బాబు వెంటాడుతుంటాయి. ఆ మధ్యన బాబుకు సంబంధించిన ఒక వార్త కొన్ని మీడియా సంస్థల్లో ప్రముఖంగా వచ్చింది. ఈ సందర్భంగా బాబు తీరును వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. చంద్రబాబు తాను నిర్వహించే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులను ఫోన్లతో అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఇక్కడితో ఆ వార్తలు పూర్తి కాలేదు. చివరకు తనను వ్యక్తిగతంగా కలవటానికి వచ్చే మంత్రులు.. పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఫోన్లతో లోపలకు అనుమతించటం లేదంటూ వార్తలురాశారు. ఈ విషయాన్ని వార్తగా రాయటం తప్పేంటన్న ప్రశ్న వేయొచ్చు. సమాచారాన్ని సమాచారంగా ఇవ్వకుండా.. ఓటుకు నోటు కేసు ఇష్యూలో ఇరుక్కున్న చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే.. సెల్ ఫోన్లను బాబు అనుమతించటం లేదంటూ రాసిన వ్యాఖ్యానంతోనే అసలు అభ్యంతరమంతా.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎవరూనమ్మలేని పరిస్థితి. ఇద్దరుముఖ్యులు కూర్చున్నప్పుడు.. నాలుగు మాటలు మాట్లాడుతుంటారు. ఇందులో అందరికి తెలియాల్సినవి కొన్ని ఉంటాయి.. తెలియకూడనివి కొన్ని ఉంటాయి. కానీ.. ముఖ్యులతో కూర్చున్న వ్యక్తి మైండ్ సెట్ మంచిగా లేకపోతే.. సదరు వ్యక్తిని నమ్మిన పాపానికి ముఖ్యులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అందుకే.. చంద్రబాబు లాంటి కొందరు పార్టీఅధినేతలు సెల్ ఫోన్లతో కలిసేందుకు అనుమతించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ సైతం ఫోన్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో మంత్రివర్గ సభ్యులెవరూ తమ ఫోన్లను తీసుకురావొద్దన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలకు సమాచారాన్ని అందించారు. కేబినెట్ సమావేశాలకు సభ్యులు స్మార్ట్.. మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దంటూ అధికారికంగా నిర్ణయం తీసుకోవటం భారత ప్రభుత్వం వరకూ ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ పరిధిలో జరిగే సమావేశాలకు సైతం స్మార్ట్ ఫోన్లకు అనుమతి లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సర్జికల్ దాడుల నేపథ్యంలో ఈ తరహా ముందస్తు జాగ్రత్తలు మంచివన్న నిఘా వర్గాల సూచనతో మోడీ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.