Begin typing your search above and press return to search.

సంపన్న రాష్ట్రంలో నో పేమెంట్ మాటేంటి కేసీఆర్.

By:  Tupaki Desk   |   26 Aug 2016 9:21 AM GMT
సంపన్న రాష్ట్రంలో నో పేమెంట్ మాటేంటి కేసీఆర్.
X
తమది సంపన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పుకుంటారు. డబ్బులున్నోళ్లు డబ్బులు ఉన్నాయని చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. సంపన్నులమని సగర్వంగా చెప్పుకునేటప్పుడు అందుకు తగ్గట్లే పాలనా పరమైన నిర్ణయాలు ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. కేసీఆర్ సర్కారుతో వచ్చే చిక్కేమిటంటే.. ముఖ్యమంత్రి మాటల్లో కనిపించేంత దర్పం.. చేతల్లో కనిపించదు. సంపన్న రాష్ట్రం అన్నప్పుడు సంక్షేమ పథకాల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. నిధులకు సంబంధించి కటకట అస్సలు కనిపించకూడదు.

కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. తీవ్రమైన నిధుల కటకట ఎదుర్కొంటోంది. ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారిణికి రూ.5కోట్ల నజరానా ప్రకటించటమే కాదు.. రోజుల వ్యవధిలోనే అందుకు సంబంధించిన చెక్ ను సదరు క్రీడాకారిణి చేతిలో పెట్టిన కేసీఆర్ తన మాట ఎంత ఫాస్ట్ గా అమలవుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. మరి.. అంతే వేగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల చెల్లింపుల్లో ఉందా? అంటే లేదనే మాట వినిపిస్తోంది.

సంక్షేమ పథకాల కంటే కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు ఖర్చుచేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉండటమే కాదు.. ఇందుకు తగ్గట్లే తాజాగా ఒక ఆదేశాన్ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన నిధుల కొరతనుఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలకు చెల్లింపుల్ని నిలిపివేయాలన్న సూచన చేసినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలకు తగ్గట్లుగా ఆదాయం లేకపోవటంతో నిధుల కటకట తప్పటం లేదంటున్నారు. తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.1.33లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేసీఆర్ సర్కారు ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ.72,195 కోట్లు.. ప్రణాళికేతర వ్యయం కింద రూ.61,622 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులపై అప్పట్లో పలువురు విమర్శించారు కూడా. బడ్జెట్ కేటాయింపులు చేసి ఐదునెలలు కూడా కాకుండానే డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయటం.. సంక్షేమ పథకాలకు అక్టోబర్ వరకూ నో పేమెంట్ అని చెప్పటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తమది సంపన్న రాష్ట్రంగా చెబుతూనే.. మరోవైపు చెల్లింపుల నిలుపుదల ఓకే అనేయటం చూస్తే తెలంగాణ సర్కారు ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది ఇట్టే అర్థమవుతుందంటున్నారు. సంక్షేమ పథకాలకు చెల్లింపులు నిలుపుదల చేయాలని చెప్పిన నేపథ్యంలో స్కాలర్ షిప్ లు.. ఫీజు రీయింబర్స్ మెంట్.. పింఛన్లు.. లాంటివి ఆగిపోనున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం పైన అసంతృప్తి పెంచే వీలుంది. చెల్లింపులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్న మాటపై తెలంగాణ సర్కారు కీలక నేతలు మీడియాతో ఒక మాటను వివరణగా చెప్పేయొచ్చుగా..?