పుల్వామా దాడి.. నోరుజారిన అగ్నివేశ్

Mon Feb 18 2019 16:44:30 GMT+0530 (IST)

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే స్వామి అగ్నివేశ్ మరోసారి నోరుజారారు. పుల్వామాలో భారత జవాన్లపై దాడి  ఘటన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు వస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ స్వామి అగ్నివేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉంటేనే మనం వారిని నిందించాలి. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్ ఖండించింది. వాళ్లు ఖండించకపోతే మనం వాళ్లను నిందించవచ్చు’ అంటూ అగ్నివేశ్ పేర్కొన్నారు.44మంది చనిపోయిన పుల్వామా ఉగ్రదాడి ఉదంతంపై దేశం మొత్తం అట్టుడుకుతున్న వేళ.. స్వామి అగ్నివేశ్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి. పాకిస్తాన్ ను తిట్టడాన్ని తాను తప్పుపట్టడం లేదని..అయితే ఆత్మాహుతి దాడితో భారతీయ జవాన్లను చంపిన వ్యక్తి భారత్ కు చెందిన కాశ్మీరీ అనే విషయం మరిచిపోవద్దంటూ అగ్నివేశ్ వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవలే పంజాబ్ మంత్రి మాజీ క్రికెటర్ సిద్దూ కూడా ఇలానే వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. పాకిస్తాన్ మొత్తాన్ని ఈ ఘటనతో నిందించడం తగదంటూ సిద్దూ మాట్లాడి దుమారం రేపారు. ఇప్పుడు స్వామి అగ్నివేశ్ కూడా ఇలానే మాట్లాడి వార్తల్లో నిలిచారు.