Begin typing your search above and press return to search.

డామిట్.. ‘బండ్ల’ కథ అడ్డం తిరిగింది!

By:  Tupaki Desk   |   15 Oct 2018 8:55 AM GMT
డామిట్.. ‘బండ్ల’ కథ అడ్డం తిరిగింది!
X
ఇటీవల కాంగ్రెస్ చేరిన బండ్ల గణేష్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడదామన్న ఆయన ఊహాలకు అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయన అనుకున్న షాద్ నగర్ టిక్కెట్టు ఇంకొకరు తన్నుకుపోయారు. ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దల వద్ద అసహనం వ్యక్తం చేశారట.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్, ఆ తరువాత నిర్మాతగా మారాడు. పలు చిత్రాలకు నిర్మించాడు. రాజకీయాల్లోకి చేరి శాసన సభ్యుడు కావాలన్నది ఆయన కల. పవన్ కల్యాణ్ తన దేవుడిగా అభివర్ణించిన ఆయన జనసేనలో చేరతారని అంతా అనుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి పోయారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ చేత కండువా కప్పించుకొని వచ్చారు. ఆ సమయంలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరి వచ్చారట.

ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో భరత్ అనే నేను సినిమాను పోలినట్లు బండ్ల గణేష్ అనే నేను అని మొదలుపెట్టారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కూటమిదే విజయమని తేల్చిచెప్పారు. కనీసం 104 స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా షాద్ నగర్ లేదా జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానని అన్నారు. ఆ వీడియోను నెటిజన్లు కూడా బాగా ఎంజాయ్ చేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బండ్ల గణేష్ ఎంతో ఆశించిన షాద్ నగర్ టిక్కెట్ ను చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి కేటాయించింది. ఈయన ఇక్కడ బలమైన నాయకుడు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పై వచ్చిన విముఖత కారణంగా ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ గెలుపొందారు. ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతాప్ రెడ్డే బలమైన నాయకుడిగా భావించిందట.

ఈ క్రమంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న బండ్ల గణేష్ కు ఆశాభంగం కలిగింది. ఈయనను ఎక్కడ నుంచి పోటీ చేయించాలన్న మీమాంసలో కాంగ్రెస్ పెద్దలు పడిపోయారట. అసలు బండ్లకు టిక్కెట్ దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయట. జూబ్లిహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో ఊపుమీదున్నాడు. గడిచిన సారి పోటీచేసి ఓడిపోయిన ఆయనకే ఈసారి టిక్కెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ లో లేదా సెటిలర్స్ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ ను పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారట. మరి గణేష్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేక భవిష్యత్తు ప్రణాళిక ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. అంత తాను అనుకున్నట్లే జరుగుతుందని భావించినా, కథ ఇలా అడ్డం తిరుగడంతో ఆయన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.