Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల‌కు అచ్చిరాని ప‌ట్టాభిషేకం

By:  Tupaki Desk   |   25 May 2019 5:44 AM GMT
చంద్రుళ్ల‌కు అచ్చిరాని ప‌ట్టాభిషేకం
X
ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టిన అధికారాన్ని చెలాయించ‌టం వ‌ర‌కూ ఓకే. కానీ.. దాంతో త‌మ వార‌సుల‌కు ప‌ట్టాభిషేకం చేయాల‌న్న త‌లంపును ప్ర‌జ‌లు ఎంత‌లా తిర‌స్క‌రిస్తున్నార‌న్న విష‌యం తాజాగా వెలువ‌డిన సార్వ‌త్రిక ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధినేత‌లు ఎవ‌రైనా.. వారెంత ప‌వ‌ర్ ఫుల్ అయినా.. త‌మ ఓటుతో వారిని కంట్రోల్ చేయ‌గ‌ల‌మ‌న్న సంకేతాన్ని తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లుఇచ్చార‌ని చెప్పాలి. ప‌లువురు రాజ‌కీయ వార‌సుల‌కు చెక్ చెప్ప‌ట‌మేకాదు.. రాజ‌కీయ వార‌స‌త్వానికి చెల్లుచీటి ఇచ్చేసే టైం వ‌చ్చేసింద‌న్న‌ట్లుగా ఓట‌ర్లు వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌మ రాజ‌కీయ వార‌సుల‌కు ప‌ట్టాభిషేకం చేయాల‌ని భావించిన తెలుగురాష్ట్రాల చంద్రుళ్ల‌కు ఒకేసారి షాక్ త‌గ‌ల‌టం ఒక విశేషంగా చెప్పాలి.

తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల నేప‌థ్యంలో ఇద్ద‌రు చంద్రుళ్లు త‌మ ఉనికికోసం పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేసీఆర్ తో పోలిస్తే చంద్ర‌బాబు ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని చెప్పాలి. తాజా ఎన్నిక‌ల్లో తాను అనుకున్న ఫ‌లితాలు వెలువ‌డి.. కేంద్రంలో తాను కీల‌కంగా మారిన ప‌క్షంలో.. ఈ ఏడాది మ‌ధ్య‌లో త‌న రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం చేసేసి.. తాను ఢిల్లీకి షిఫ్ట్ కావాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతారు. ఈ ఆలోచ‌న‌లో భాగంగానే ఎప్ప‌టికైనా ఇబ్బంది అవుతుందేమోన‌న్న ఉద్దేశంతో త‌న మేన‌ల్లుడు హ‌రీశ్ రావును కేసీఆర్ ప‌క్క‌న పెట్టార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌కుండా ఉండ‌టమే కాదు.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన నాలుగు నెల‌ల కాలంలో ఒక్క‌సారి కూడా వారి మ‌ధ్య భేటీ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

కేసీఆర్ అనుకున్న‌ట్లే అన్ని జ‌రిగి ఉంటే.. ఈపాటికి కేటీఆర్ ప‌ట్టాభిషేకం దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యేవి. తాజా ప‌రిస్థితుల్లో అలాంటి ఆలోచ‌న చేసేందుకు కేసీఆర్ సాహ‌సించ‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. ఏపీలో తాను అనుకున్న‌ట్లు మ‌రోసారి ప‌వ‌ర్ చేతిలోకి వ‌స్తే.. కేంద్రంలో మోడీ స‌ర్కారుకు బ‌దులు మిత్ర‌ప‌క్షాల చేతికి ప‌వ‌ర్ వ‌స్తే.. త‌న కొడుక్కి ఏపీ పీఠాన్ని అప్ప‌జెప్పి ఢిల్లీకి వెళ్లాల‌న్న ఆలోచ‌న చేసిన‌ట్లు చెబుతారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబు ఆశ‌ల్ని ఆడియాశ‌లు చేయ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో అలాంటి ఆలోచ‌న చేయ‌టానికి సైతం భ‌య‌ప‌డేలా ఏపీ ఓట‌ర్లు తీర్పు ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చూస్తే.. త‌మ రాజ‌కీయ వార‌సుల‌కు ప‌ట్టాభిషేకం చేయాల‌న్న ఆలోచ‌న‌కు చెక్ పెట్టేలా ఓట‌ర్లు తీర్పు ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వార‌సుల‌కు ప‌ట్టాభిషేకం సెంటిమెంట్ చంద్రుళ్ల‌కు క‌లిసి రాన‌ట్లుగా లేదూ?