Begin typing your search above and press return to search.

రజనీ.. మళ్లీ బ్యాక్ ఫుట్

By:  Tupaki Desk   |   23 Nov 2017 6:07 AM GMT
రజనీ.. మళ్లీ బ్యాక్ ఫుట్
X
రోబో 2.0 వెర్షన్ గా వస్తూ 60 ఏళ్లు దాటిన వయసులోనూ కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వెండితెరను ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకోకానీ రాజకీయాలంటే మాత్రం భయపడిపోతున్నారు. సినిమాల్లో అడ్వాన్స్ వెర్షన్ 2.0గా వస్తున్నా కూడా రాజకీయాల్లో మాత్రం 0 గా మిగిలిపోతున్నారు. ఈ డిసెంబరులో ఆయన రాజకీయ ప్రకటన ఖాయం అనుకుంటున్న తరుణంలో అభిమానుల ఆశల నీరుగారుస్తూ ఆయన అప్పుడే కాదు అనేశారు. తన రాజకీయ ప్రవేశం ఇప్పట్లో లేదని ప్రకటించారు. దీంతో రజనీకి పొలిటికల్ ఫోబియా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి జయలలిత మరణం తరువాత తమిళనాట రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. అక్కడ కొత్త నాయకత్వం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రజనీ సమకాలికుడు అయిన కమల్ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కుర్ర నటులు కూడా పావులు కదుపుతున్నారు. కానీ, రజనీ మాత్రం రాజకీయాల గుమ్మం వరకు వచ్చి ఆగిపోతున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రవేశం కోసం రెండు సార్లు అభిమానులతో సమావేశాలు నిర్వహించిన ఆయన మళ్లీ ఎందుకో వెనక్కుతగ్గారు.

మరోవైపు దక్షిణాదిలో పాలిటిక్సులో కెరీర్ ఆశిస్తున్న సినీ నటులంతా 2019 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అటు కన్నడ సీమ నుంచి ఉపేంద్ర రెడీ అయ్యారు. ఆయన కూడా రీసెంటుగా పార్టీ లాంఛ్ చేశారు. కేరళలోనూ సినీనటులు సొంతంగా పార్టీలు పెట్టకపోయినా రాజకీయ పార్టీల్లో యాక్టివ్ కావడానికి రెడీ అవుతున్నారు. అంతెందుకు తమిళనాడులోనే కమల్ జోరుమీదుండగా విజయ్ కూడా మెర్సెల్ సినిమాతో పొలిటికల్ కలర్స్ చూపించారు. అటు విశాల్ కూడా డైరెక్టుగా ఏమీ చెప్పకున్నా పాలిటిక్సుపై ఆసక్తిగానే ఉన్నట్లు చెప్తున్నారు.

దక్షిణాది యాక్టర్లు అంతా ఇంతా యాక్టివ్ గా పాలిటిక్సు వైపు అడుగులేస్తుంటే రజనీ మాత్రం వారందరి కంటే ఎక్కువ అవకాశాలున్నా.. బీజేపీలాంటి పార్టీలు ఆయన కోసం ఎదురు చూస్తున్నా, ఆయన నుంచి సొంత పార్టీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నా రజనీ మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు. నిజానికి గత కొన్ని నెలలుగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాది మే నెల‌లో ఆయన రాజ‌కీయ అరంగేట్రంపై తీవ్రంగా చ‌ర్చ జ‌రిగింది. దేవుడు ఆదేశిస్తే రాజ‌కీయాల్లోకి త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తాన‌ని ర‌జ‌నీ కాంత్ త‌న అభిమానుల సమ‌క్షంలో వెల్ల‌డించాడు. జీవితంలో ప్ర‌తి ద‌శ‌లోను దేవుడు మ‌న‌ల్ని న‌డిపిస్తాడ‌ని …ప్ర‌స్తుతం త‌న‌ను న‌టుడిగానే కొన‌సాగ‌మ‌ని దేవుడు ఆదేశించాడ‌ని ర‌జ‌నీ చెప్పాడు. ప్ర‌స్తుతం ఆ బాధ్య‌త‌నే తాను నిర్వ‌హిస్తున్నాన‌ని తెలిపాడు. దేవుడు రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని ఆదేశిస్తే రేపే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ర‌జ‌నీ చెప్పాడు. తాజాగా తన పొలిక‌ల్ ఎంట్రీపై మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న తొంద‌ర త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశాడు.