Begin typing your search above and press return to search.

ఇజ్రాయిల్ దాకా ఎందుకు మన దగ్గరా అంతే బాస్

By:  Tupaki Desk   |   4 Sep 2015 6:42 PM GMT
ఇజ్రాయిల్ దాకా ఎందుకు మన దగ్గరా అంతే బాస్
X
శుక్రవారం ఒక వార్త ప్రముఖ వార్తా సంస్థలకు చెందిన వెబ్ సైట్లలో ప్రచురించారు. ఇంతకీ ఆ వార్తేమిటంటే.. పాత్రికేయులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు పత్రికల్లో వెల్లడించకూడదని ఇజ్రాయిల్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ లాంటి దేశంలో చూశారా? పాత్రికేయులకు స్వేచ్ఛ లేదన్నట్లుగా సదరు వార్తలో పేర్కొన్నారు.

ఇజ్రాయిల్ ప్రభుత్వం పాత్రికేయులు తమ అభిప్రాయాలు పత్రికల్లో చెప్పకూడదని స్పష్టం చేయటంతో పాటు.. నిషేధిస్తూ చట్టం కూడా చేసి పారేశారు. ఇజ్రాయిల్ దుస్థితి గురించి వర్రీ అయిపోయిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు.

విషాదకరమైన విషయం ఏమిటంటే.. అక్కడెక్కడో ఇజ్రాయిల్ దాకా ఎందుకు.. మన చుట్టూ ఉన్న సమాజంలోనూ పాత్రికేయులు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉందా? అన్నది ఒక ప్రశ్న. మారిన రాజకీయ పరిణామాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు రాజకీయ అంశాల గురించి ఎవరూ ఓపెన్ గా మాట్లాడలేని దుస్థితి.

ఒక్క రాజకీయాలు మాత్రమే కాదు.. సినిమా పరిశ్రమ మాత్రం తక్కువ తిందా? సినిమా.. పాత్రికేయం రెండు సమాంతరంగా పని చేస్తుంటాయి. కానీ.. మారిన కాలంతో.. ప్రతిది వాణిజ్యమైన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని అయితే గియితే పొగిడేయాలే కానీ.. విమర్శిస్తే మాత్రం మండిపడే పరిస్థితి. అంతదాకా ఎందుకు.. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఫీలయ్యే చాలామంది మేధావి దర్శకులు తీసిన సినిమాలకు సంబంధించి పోస్టర్లు..కొన్ని సీన్లకు సంబంధించి కాపీ యవ్వారాల గురించి ఈ మధ్య ప్రస్తావించటం కోపం వచ్చేస్తుంది.

ఇక.. సినిమాలు విడుదలయ్యాక సినిమా రివ్యూల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమ సినిమా విలువ కోట్లాది రూపాయిలతో నిర్మించామని.. నెలల తరబడి రూపొందించామని.. అలాంటిది ఆ సినిమాను మూడు గంటలపాటు చూసేసి.. తోచినట్లు రాసేస్తారా? అంటూ ప్రశ్నించే సినీ పెద్దలు చాలామందే తయారయ్యారు.

తాజాగా విడుదలైన ఒక సినిమాకు సంబంధించి.. రివ్యూల్లో కాస్త తేడాగా రాసినా.. ‘‘బాబుగారికి’’ కోపం వచ్చేసిందంటూ వారి వర్గం నుంచి ఫోన్లు రావటమే కాదు.. రివ్యూలు అలా రాసేస్తారా? అని సూటిగా అడిగేస్తున్నారు. మీ పని మీది అయితే.. మా పని మాదని సమాధానం చెప్పే బక్క జర్నలిస్టులకు తోడుగా నిలిచే వారు ఎవరూ ఉండటం లేదు.

కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి.. తమకిష్టం వచ్చినట్లు సినిమా తీసేసే హక్కు సినిమా వాళ్లకు ఉందనుకుంటే.. అలాంటి సినిమాల గురించి రివ్యూ ఉన్నది ఉన్నట్లు రాయటం కూడా అగ్రహం తెప్పించటం తాజా పరిణామం. ఇలాంటివన్నీ చూసినప్పుడు.. ఇజ్రాయిల్ లోనే కాదు.. ఇక్కడ కూడా పాత్రికేయ స్వేచ్ఛకు.. అభిప్రాయానికి హద్దులు చాలానే వచ్చాయన్నది మర్చిపోకూడదు.