Begin typing your search above and press return to search.

ఎర్ర‌న్న‌లు ఇక చ‌రిత్రే....ఇంత‌కంటే సాక్షం ఏం కావాలి?

By:  Tupaki Desk   |   27 May 2019 6:29 AM GMT
ఎర్ర‌న్న‌లు ఇక చ‌రిత్రే....ఇంత‌కంటే సాక్షం ఏం కావాలి?
X
ప‌శ్చిమ‌బెంగాల్‌...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని రాష్ట్రం. ఢిల్లీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఎంపీ సీట్ల‌ను క‌లిగి ఉన్న ప్రాంతం. క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌. ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన గడ్డ అది. దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలిన రాష్ర్టమది. ముఖ్య‌మంత్రిగా బుద్ధాదేవ్ భ‌ట్టాచార్య రికార్డు సృష్టించిన ఇలాకా. అయితే, కాలం గిర్రున తిరిగింది. ఓడలు బండ్లయ్యాయి. అధికారం సంగతి దేవుడెరుగు. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి దిగజారిపోయారు. త‌ద్వారా కమ్యూనిస్టులు అంటే కేవ‌లం చ‌రిత్రే అనే స్థితికి చేరిపోయారు.

లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ లో క‌మ్యూనిస్టుల ఘోర ప‌రాజ‌యం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. లెఫ్ట్ ఫ్రంట్ అభ్య‌ర్థులు ఘోరంగా ఓడిపోయారు. పోటీచేసిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా, మిగతా వారందరూ డిపాజిట్లు కోల్పోయారు. జాదవ్ పూర్ నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి బికాశ్ రంజన్ భట్టాచార్య మాత్రమే 21.04శాతం ఓట్లు సాధించి , డిపాజిట్ దక్కించుకున్నారు . చాలా సీట్లలో లెఫ్ట్ అభ్యర్థులకు పడ్డ ఓట్లు 10 శాతం కూడా దాటలేదు. మొత్తంగా చూస్తే లెఫ్ట్ పార్టీలకు దేశవ్యాప్తంగా కేవలం 5 సీట్లు మాత్రమే దక్కా యి. 1952 నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టులకు అతి తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి కావ‌డం..రాష్ట్రంలో వేగంగా ప‌త‌నం అవుతున్న వామ‌పక్షాల స‌త్తాకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

గత గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ సొంతగా 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే 352 స్థానాలు కైవసం చేసుకుంది. మోడీ సునామిలో ప‌శ్చిమ‌బెంగాల్లో సైతం ఆ పార్టీ ప్ర‌ముఖంగా స్థానాలు గెలుచుకుంది. త‌న పార్టీ గోర ప‌రాజ‌యానికి బాధ్య‌త‌గా ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.