Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రో.. ఎవ‌రైనా స‌రే టికెట్ మ‌స్ట్‌

By:  Tupaki Desk   |   12 Oct 2017 6:21 AM GMT
హైద‌రాబాద్ మెట్రో.. ఎవ‌రైనా స‌రే టికెట్ మ‌స్ట్‌
X
విష‌యం ఏదైనా.. వేదిక మ‌రేదైనా.. వీఐపీల‌కు స్పెష‌ల్ ట్రీట్ మెంట్ ఉండాల్సిందే. ప్ర‌త్యేకంగా చూడ‌క‌పోతే అస్స‌లు ఊరుకోరు. ప్ర‌త్యేక సేవ‌ల‌తో పాటు.. రాయితీలు కోరుకునే బ్యాచులు చాలామందే ఉంటారు. ప్ర‌భుత్వ రంగ సేవ‌ల్లోనూ.. ప్ర‌జార‌వాణా విష‌యంలో ప‌లువురు వీఐపీల‌కు కొన్ని ప్ర‌త్యేక రాయితీలు ఇవ్వ‌టం క‌నిపిస్తుంటుంది. అయితే.. హైద‌రాబాద్ మెట్రోలో అలాంటి ప‌ప్పులేం ఉడ‌క‌వ‌ని చెబుతున్నారు.

ఆర్టీసీ.. ఎంఎంటీఎస్‌.. రైల్వేల‌లో మాదిరి టికెట్ల మీద రాయితీలు అనేవి ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేస్తోంది హైరాబాద్ మెట్రో. ఎవ‌రైనా.. ఎలాంటి వారైనా.. మెట్రో ఫిక్స్ చేసిన ధ‌ర‌ల‌కు టికెట్లు కొనుక్కొని మాత్ర‌మే ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. మిగిలిన న‌గ‌రాల‌తో పోలిస్తే.. హైద‌రాబాద్ మెట్రో రైలు టికెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయ‌న్న మాట వినిపిస్తోంది. టికెట్ ధ‌ర‌లు పూర్తిగా అందుబాటులో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.

పూర్తిగా ప్రైవేటు.. ప‌బ్లిక్ భాగ‌స్వామ్యంలో నిర్మిత‌మ‌వుతున్న హైద‌రాబాద్ మెట్రోలో రాయితీలు అన్న‌వే లేవ‌న్న మాట విన్న‌ప్పుడు వీఐపీలు.. ప‌లువురు ముఖ్యుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. 2014లో అనుకున్న ధ‌ర‌ల ప్ర‌కారం చూస్తే.. మెట్రో రైల్ మినిమం ఛార్జి రూ.8 నుంచి గ‌రిష్ఠంగా రూ.19గా ఫిక్స్ చేశారు. ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌టం.. ఇత‌ర కార‌ణాల నేప‌థ్యంలో మినిమం ఛార్జి రూ.10.. మ్యాగ్జిమం ఛార్జి రూ.30 వ‌ర‌కూ ఉండే వీలున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ ఏసీ బ‌స్సుల‌తో పోల్చిన‌ప్పుడు మెట్రో ధ‌ర‌లు కాసింత త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అధికారిక నిర్ణ‌యం ప్ర‌క‌టించాల్సి ఉంది. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. మెట్రోలో ఎవ‌రైనా టికెట్ తీసుకోవాల్సిందేనన్న మాట వీఐపీలకు మంట పుట్టిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.