సింగ 'పూర్' పర్యటన....

Thu Jul 12 2018 12:26:32 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలు బలే జోరుగా సాగుతున్నాయి. చీటికీ మాటికీ పెట్టుబడుల పేరుతో సింగపూర్ వెళుతున్న చంద్రబాబు నాయడు ఈ నాలుగేళ్ళలో ఎంత పెట్టుబడి తీసుకొచ్చారో దేవుడికే తెలియాలి.  2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 20 నుంచి 25 సార్లు సింగపూర్ వెళ్ళారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అంటూ అక్కడకు వెళ్ళి ఏం సాధించుకొచ్చారో ఆయన సహచరులకే తెలియాలి. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఉత్త చేతులతోనే వస్తున్నారు. అక్కడ జరుగుతున్న తతంగం ఏమిటో ఇక్కడి ప్రజలకు అంతుచిక్కటం లేదు. పెట్టుబడుల పేరుతో అక్కడికి వెళ్లి చంద్రబాబు నాయుడు తన సొంత పనులు చూసుకుంటున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.ప్రజల సొమ్ముతో సింగపూర్ వెళ్ళి వట్టి చేతులతో రావడం చంద్రబాబుకు పరిపాటేనని కూడా అంటున్నారు. సదస్సుల పేరుతో తనతో పాటు మంత్రులను అధికారులను కూడా వెంట తీసుకుని వెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ పేరు చెప్పుకుని చంద్రబాబు సింగపూర్ లోని తన వ్యాపారాలను అభివ్రుధ్ది చేసుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఐనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన సింగపూర్ విహారానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదు.

సింగపూర్ వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆ పర్యటన మరింతా పూర్ గా మారుతోంది. రాష్ట్ర విభజన  తర్వాత ఆర్దికంగా చతికిలబడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడి విదేశీ పర్యాటనల ఖర్చు తడిసి మోపెడవుతోంది. అయినా ముఖ్యమంత్రి పర్యటనల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. తన వెంట కనీసం 20 మంది అధికారులు - మంత్రులు - వందిమాగదులను విదేశి పర్యటనలకు తీసుకుని వెళ్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇంత మందీమార్బలంతో వెళ్లడం అవసరమా అని ప్రతిపక్షాలు - రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.