Begin typing your search above and press return to search.

మోడీకి షాక్.. కదిలిన నిజామాబాద్ రైతులు

By:  Tupaki Desk   |   23 April 2019 11:02 AM GMT
మోడీకి షాక్.. కదిలిన నిజామాబాద్ రైతులు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కలు చూపిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ నుంచి వారణాసికి బయలు దేరి వెళుతున్నారు. అక్కడ వారణాసిలో మోడీపై నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వీరి బాధ ఇక దేశవ్యాప్తంగా తెలియనుంది.

ఈనెల 11న జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 178మంది పసుపు - ఎర్రజొన్న రైతులు ఎంపీ కవితపై పోటీకి దిగారు. పసుపు బోర్డు ఏర్పాటు - ఎర్రజొన్న కు మద్దతు ధర చెల్లించాలనే తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని సమస్యలను పరిష్కరించాలని ఇలా ఎంపీ స్థానానికి పోటీచేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. భారీ పోలింగ్ కు దారితీశారు. 12ఈవీఎంలు వాడారు. దేశంలోనే అతిపెద్ద ఎన్నికగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నిజామాబాద్ ఎన్నిక ద్వారా కూడా వీరి సమస్య పరిష్కారం కాకపోవడంతో జాతీయ స్థాయిలో నిరసనకు ప్లాన్ చేశారు.

తాజాగా తమ సమస్యను దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చలో వారణాసికి శ్రీకారం చుట్టారు.

2014 ఎన్నికల్లో మోడీ వారణాసి నుంచి పోటీచేశారు. ఈ దఫా కూడా అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. ఈ ఏడాది మే 19న వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ రైతులు అక్కడ నామినేషన్ వేస్తామని నిర్ణయించుకోవడంతో వీరి సమస్య మోడీతోపాటు దేశమంతా తెలియనుంది. కవితకు షాక్ ఇచ్చిన నిజామాబాద్ రైతులు ఇప్పుడు మోడీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు.