Begin typing your search above and press return to search.

నితీశ్....నువ్వు సూప‌ర్‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:30 PM GMT
నితీశ్....నువ్వు సూప‌ర్‌
X
రాజ‌కీయ నాయ‌కులంటే ఏం చేస్తారు? ఓట్ల‌కోసం ఏమైనా చేస్తారు. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే వారికి ప‌ట్ట‌ప‌గ్గాలే ఉండ‌వు. నోటికి వచ్చిందే మాట‌....మ‌న‌సుకు న‌చ్చిందే హామీ. అయితే ఎన్నిక‌లు ముగిసి, ఓట్లు డ‌బ్బాలో ప‌డిపోగానే వారి ఆలోచ‌న హ‌ఠాత్తుగా మారిపోతుంది. పైగా ఎన్నిక‌ల్లో గెలిచిన వారు అయితే...అబ్బో వారి గురించి ఎంత త‌క్కువ‌గా ఆలోచిస్తే అంత మంచిది. హామీలు ఘ‌నం...అమ‌లు శూన్యం అన్న‌ట్లుంటుంది స‌ద‌రు నాయ‌కుల తీరు. కానీ ఇందుకు తాను భిన్నం అని నిరూపించుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.

హోరాహోరిగా జ‌రిగిన పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు నితీశ్ త‌న‌దైన శైలిలో ముందుకువెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల హామీల‌తో పాటు ప్ర‌జాసంక్షేమ హామీల‌ను కూడా ఇచ్చారు. ఈ విధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక దానిని నితీశ్ తాజాగా నెరవేర్చారు. బీహార్‌ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపడితే రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధిస్తానన్న హామీని నితీశ్ కుమార్ విజ‌య‌వంతంగా నెర‌వేర్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోనికి వస్తుంది.

రాజ‌కీయ నాయ‌కుల్లో భిన్న‌మైన వ్య‌క్తిత్వం గ‌ల నితీశ్ కుమార్ త‌న ప‌రిపాల‌న‌తో గ‌తంలో బీహారీల హృద‌యాన్ని దోచుకున్న సంగ‌తి తెలిసిందే. మాటమీద నిల‌బ‌డే గుణం, ప్రజ‌ల సంక్షేమానికి పెద్ద పీట వేసే వ్య‌వ‌హార‌శైలి వ‌ల్లే నితీశ్ విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో ప‌గ్గాలు చేప‌ట్టిన వారం రోజుల్లోనే హ‌మీల అమ‌లుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మే.