Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ విలపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 July 2017 6:26 PM GMT
రాహుల్ గాంధీ విలపిస్తున్నారా?
X
కొన్నిరోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఢిల్లీలో రాహుల్ ను కలిశారు. బీహార్ లో లాలూ కుమారుడు తేజస్విపై వచ్చిన అవినీతి విచారణ పర్వం గురించి, ఆ నేపథ్యంలో రాజీనామాకు తాను ఆదేశించడం గురించి, దాని పర్యవసానంగా ఏర్పడిన ప్రతిష్టంభన గురించి ఆయన బహుశా రాహుల్ కు నివేదించి ఉంటారు. అయితే లాలూ తనకు గౌరవం ఇచ్చే తరహా నాయకుడు కాకపోయినప్పటికీ.. లాలూను కాదని మరో రాజకీయ సమీకరణాన్ని సూచించే సత్తా లేని రాహుల్ చేతులెత్తేసి ఉంటారు. ఆయన ఏదైనా రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కబరచడానికి ప్రయత్నించిచ ఉంటే పరిణామాలు మరోలా ఉండేవి. తేజస్వి తో రాజీనామా చేయించగలవారు లేకపోవడంతో.. నితీశ్ మాస్టర్ స్ట్రోక్ ప్రయోగించారు. తానే రాజీనామా చేసి ప్రభుత్వాన్నే కూల్చేశారు.

ఇప్పుడు భాజపా రంగంలోకి వచ్చింది. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రధాని అభ్యర్థి అయ్యేట్లయితే తాను కూటమిలో ఉండనంటూ నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మోడీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ హవాకంటె తన హవా ఎక్కువని అప్పట్లోనూ నిరూపించారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ మోడీ హవాకు చావుదెబ్బ కొట్టారు. ఇన్ని జరిగినా సరే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే సంగతిని మనం గుర్తంచుకోవాలి. ఇప్పుడు మోడీ తానే ఒక అడుగు ముందుకేసి, రాజీనామాను ట్విటర్ లో అభినందించి, ఆ వెంటనే.. తిరిగి నితీశ్ ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి.. తమ పార్టీ మద్దతు ఇచ్చేలా కూడా పావులు కదిపారు. అక్కడికి కథ సుఖాంతం అయింది.

అయితే ఈ ఎపిసోడ్ ఇలా ముగిసేసరికి విలాపాలు, దు:ఖం మిగిలింది ఎవరికయ్యా.. అంటే అది రాహుల్ గాంధీకే! అనవసరంగా ఒక రాష్ట్రంలో అధికార కూటమిలో తమ పార్టీ కూడా భాగస్వామిగా ఉండే భాగ్యం ఇప్పుడు తిరగబడింది. నితీశ్ వచ్చి ముందు తనకే ఆఫర్ ఇచ్చి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరినా కూడా.. తన అచేతనత్వమే ఈ దుస్థితికి కారణమని రాహుల్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు విలపించే మూడ్ లో ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.