మోడీ కోసం ముందస్తు అంటున్న నితీశ్

Mon Jul 17 2017 14:18:41 GMT+0530 (IST)

2014 ఎన్నికల తరువాత మోడీతో తీవ్రంగా విభేదించి బీహార్ ఎన్నికల వేళ మోడీ వ్యతిరేకులందరితో జట్టుకట్టి మరీ మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేసి బీహర్లో మోడీ హవాను అడ్డుకునున్న నేత నితీశ్ కుమార్ యాదవ్.  ఇప్పుడాయన మోడీతో మళ్లీ ఫ్రెండ్షిప్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహా ఘట్ బంధన్ లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో నితీశ్ కు విభేధాలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
    
లాలూ తనయుడు - డిప్యూటీ సీఎం అయిన తేజస్వీ యాదవ్ పై ఆరోపణలు రావడంతో ప్రభుత్వంపై మరక పడుతోంది. అయితే.. తేజస్వి రాజీనామా చేయడం లేదు. దీంతో నితీశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి తాజాగా మరోసారి ప్రజాభిప్రాయాన్ని కోరాలని భావిస్తున్నట్టు సమాచారం. అలా చేసే క్రమంలో ఆర్జేడీతో విడిపోయి భాజపాతో జట్టుకట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
    
తేజస్వీ యాదవ్ ను తొలగించాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతూ ఉండటం ఇప్పటికిప్పుడు తొలగిస్తే ప్రభుత్వం అస్థిరమయ్యే అవకాశాలు ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నితీశ్ కుమార్ - ప్రజాభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించుకోవచ్చని జేడీ (యూ) వర్గాలు కూడా అంటున్నాయి. అయితే.. బీహార్ లో విజయం సాధించిన మహా ఘటబంధన్ ను మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ - ఎలాగైనా నితీశ్ - లాలూలను కలిపి ఉంచాలనే భావిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సోనియా గాంధీ - ఇద్దరు నేతలతో విడివిడిగా మాట్లాడింది. అయితే... నితీశ్ మాత్రం ఈ అప్రతిష్ఠ నుంచి బయటపడి తన క్లీన్ ఇమేజ్  కాపాడుకోవాలంటే లాలూకు దూరమై మోడీకి చేరువై ఎన్నికలకు వెళ్లడమే బెటరని భావిస్తున్నట్లు టాక్.