Begin typing your search above and press return to search.

మోదీ క‌ల‌...గ‌డ్క‌రీకి నిద్ర లేకుండా చేసిందే!

By:  Tupaki Desk   |   17 March 2017 7:16 AM GMT
మోదీ క‌ల‌...గ‌డ్క‌రీకి నిద్ర లేకుండా చేసిందే!
X
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... నాలుగు రాష్ట్రాల్లో పాల‌న‌ను చేజిక్కించుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సంపూర్ణ మెజారిటీ సాధించిన ఆ పార్టీ... నిజంగా ఘ‌న విజ‌యం సాధించింద‌నే చెప్పాలి. యూపీ - ఉత్త‌రాఖండ్‌ మిన‌హా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీకి పెద్ద‌గా ఆశించిన మేర ఫ‌లితాలు రాలేదు. పంజాబ్ లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌గా, గోవా - మ‌ణిపూర్‌ ల‌లో ఆ పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలే వీచాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా... కాంగ్రెస్‌ కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చిన పంజాబ్‌ లో మిన‌హా మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠాల‌ను ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ అధిష్ఠానం - ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నెర‌పిన మంత్రాంగం చూస్తే... ఇలా కూడా చేస్తారా? అనిపించ‌క మాన‌దు. దేశంలో అశేష జ‌నాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా ఉన్న మోదీ... మెజారిటీ కంటే చాలా త‌క్కువ స్థాయిలో సీట్లు వ‌చ్చినా, అంతేకాకుండా అధికార పీఠాన్ని ద‌క్కించుకునే విష‌యంలో త‌న‌కంటే మెరుగైన ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మోదీ త‌న‌దైన మంత్రాంగాన్ని న‌డ‌ప‌డం ఇక్క‌డ ఆస‌క్తిక‌రంగా మారింద‌నే చెప్పాలి.

అధికారానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న కాంగ్రెస్ ను కాద‌ని మెజారిటీకి చాలా దూరంలో ఉన్న బీజేపీకి అధికారం ద‌క్కేలా మోదీ వేసిన ప్లాన్ దేశ ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురి చేయ‌క మాన‌దు. మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి కాస్తంత ప‌క్క‌న‌బెడితే... ప‌దేళ్ల పాటు బీజేపీ పాల‌న‌లోనే ఉన్న గోవాలో ఆ పార్టీకి ఈ ద‌ఫా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. మొత్తం 40 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి కేవ‌లం 13 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఇక ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థి - సిట్టింగ్ సీఎం ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్ ఏకంగా ఓట‌మి పాల‌య్యారు. దీంతో షాక్ తిన్న బీజేపీ... మూడో ప‌ర్యాయం కూడా గోవాలో అధికారం చేజిక్కించుకోవాల్సిందేన‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ఇందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించిన మోదీ... దానిని అమ‌లు చేసే బాధ్య‌త‌ల‌ను త‌న కేబినెట్‌ లోని కీల‌క మంత్రి - పార్టీ మాజీ జాతీయ అధ్య‌క్షుడు - పార్టీ గోవా వ్య‌వ‌హారాల ఇన్‌ చార్జీ నితిన్ గ‌డ్క‌రీ భుజ స్కందాల‌పై పెట్టారు. మెజారిటీ లేకుండానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఎలా సాధ్య‌మంటూ గ‌డ్క‌రీ నీళ్లు న‌మిలినా కూడా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో చెప్పించి మ‌రీ గ‌డ్క‌రీని మోదీ రంగంలోకి దించేశారు. మోదీ - అమిత్ షాల ఒత్తిడితో అయిష్టంగానే రంగంలోకి దిగిన గ‌డ్క‌రీకి ఈ నెల 11 రాత్రి అస‌లు నిద్రే లేకుండా గ‌డ‌పాల్సి వ‌చ్చింద‌ట‌. ఇదేదో విప‌క్ష కాంగ్రెస్ పార్టీనో, బీజేపీ అంటే గిట్ట‌ని మీడియానో చెబుతున్న విష‌యం ఎంత‌మాత్రం కాదు. స్వ‌యంగా గ‌డ్క‌రీనే ఈ విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్లు... ఆ రాత్రి తాను ఎలా గ‌డ‌పింది చెప్పుకొచ్చారు.

ఆ వివ‌రాలు ఆయ‌న మాటల్లోనే... ఈ నెల 11న అమిత్ షా నుంచి పోన్ వ‌చ్చింది. ఉన్న‌ప‌ళంగా త‌న వ‌ద్ద‌కు రావాల‌న్న పార్టీ అధ్య‌క్షుడి హుకుంతో ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లాను. గోవాలో ఎలాగైనా మూడో ప‌ర్యాయం కూడా మ‌న‌మే అధికారం చేప‌ట్టాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి అంటూ షా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లుంటే... మ‌న‌కు 13 సీట్లే ఉన్నాయి. ఎలా సాధ్య‌మ‌ని అడిగా. అదంతా తెలియ‌దు. మోదీ చెప్పారంటూ అమిత్ షా చెప్పారు. దీంతో అప్ప‌టికప్పుడు ఢిల్లీలో ప‌ణ‌జీ ఫ్లైట్ ఎక్కాల్సి వ‌చ్చింది. ప‌ణ‌జీలో కాలు మోప‌గానే... అప్ప‌టికే ఎయిర్‌ పోర్టులో వేచి చూస్తున్న పార్టీ నేత‌లు ప‌రిస్థితి మొత్తం వివ‌రించారు. మాకు మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేల లిస్టును ఓసారి ప‌రిశీలించుకుని వారితో చ‌ర్చ‌లు మొద‌లెట్టా. మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్యే ఓ ష‌ర‌తు పెట్టాడు. అయితే వారంతా కూడా సీఎంగా మ‌ళ్లీ మ‌నోహ‌ర్ పారీక‌ర్ వ‌స్తేనే తాము మ‌ద్ద‌తు ప‌లుకుతామంటూ ఉమ్మ‌డి ష‌ర‌తు విధించారు. పారీక‌ర్‌ను తిరిగి రాష్ట్రానికి పంపే విష‌యంలో మోదీ సంసిద్ధంగా లేర‌న్న విష‌యం నాకు తెలుసు. మ‌రేం చేయ‌లి? ఇదే విష‌యాన్ని షాకు రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత ఫోన్ చేసి చెప్పా. తెల్లార‌గ‌ట్లే మోదీ నుంచి ఫోన్ వ‌స్తుంది. వేచి చూడండి. ఉన్న అవ‌కాశాల‌ను ఏమాత్రం వ‌దల‌వ‌ద్దు అంటూ షా చెప్పారు. దీంతో రాత్రి ఒక్క‌క్ష‌ణం కూడా నిద్ర పోయే అవ‌కాశం చిక్క‌లేదు. తెల్లార‌క‌ముందే షా నుంచి ఫోన్ రాగా... తెల్లారిన త‌ర్వాత మ‌రోమారు ఆయ‌న నుంచి ఫోన్ రావ‌డం, పారీక‌ర్‌ ను గోవాకు పంపేందుకు మోదీ ఒప్పుకున్నార‌ని చెప్ప‌డంతో నేను కూడా అదే విష‌యాన్ని మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేల‌కు చెప్ప‌డంతో ప‌ని పూర్తి అయ్యింది. ఈ క్ర‌మంలో రాత్రి క్ష‌ణం కూడా నిద్ర పోవ‌డానికి వీలు కాలేదు* అంటూ గ‌డ్క‌రీ త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/