బాబు కంటే...రాయపాటికే ఢిల్లీలో పట్టుందా?

Thu Oct 19 2017 13:45:09 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి -తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుతారని తను అనుకున్న పనులను అనుకున్నట్లుగా...చకచకా చేసేస్తారనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీ నేతగా జాతీయ రాజకీయాలను సైతం బాబు ప్రభావితం చేస్తారనే టాక్ ఉంది. అయితే అలాంటి  చంద్రబాబు చేయలేని పనిని ఆయన పార్టీకి చెందిన ఎంపీ చేసేశారు. చిత్రంగా బాబు వ్యతిరేకించింది ఆ ఎంపీకి సంబంధించిన కంపెనీ అయితే...ఆయన లాబీయింగ్ విఫలమయి..ఎంపీ మాటే నెగ్గిందంటున్నారు. ఇదంతా....పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ గురించి. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ట్రాన్ ట్రాయ్ సంస్థ విఫలమైందనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిందనేది కూడా సుపరిచితం. అయితే పోలవరం పనులు అనుకున్న రీతిలో జరగని నేపథ్యంలో కాంట్రాక్టరును మార్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి గడ్కరీకి తెలియజేయగా....ప్రస్తుత కాంట్రాక్టరును మార్చేది లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయవర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం చంద్రబాబు కంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే బీజేపీ నేతల వద్ద మాట నెగ్గించుకోవడంలో సక్సెస్ అయ్యారట. కాంట్రాక్టరు మార్పు విషయంలో తనను లక్ష్యంగా చేసుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని భావించిన ఎంపీ రాయపాటి ఒక దశలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసేందుకు ప్రయత్నించారని సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తన సంస్థను తప్పించి బాబుకు సన్నిహిత కంపెనీలయిన మెగా - ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన సంస్థలకు పోలవరం కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పెద్దలతో రాయపాటి వెల్లడించినట్లు తెలుస్తోంది. రాయపాటి వాదనతో కన్వీన్స్ అయిన బీజేపీ అగ్రనేతలు కాంట్రాక్టర్ను మార్చేందుకు నో చెప్పారని సమాచారం. దీంతో నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసినప్పటికీ ఫలితం రాకపోవడంతో ఖంగుతిన్న సీఎం చంద్రబాబు అట్నుంచి అటే ఢిల్లీకి వెళ్లి అమెరికా పర్యటనకు వెళ్లారని అంటున్నారు.