Begin typing your search above and press return to search.

కేంద్రం చెప్పింది బీహార్ గురించంట

By:  Tupaki Desk   |   3 Aug 2015 4:28 AM GMT
కేంద్రం చెప్పింది బీహార్ గురించంట
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చిత్రమైన వాదనను వినిపించారు. చెవిలో పువ్వులు పెడితే ఇట్టే నమ్మేసే ఆంధ్రోళ్ల మనసులు సేద తీరేలా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏదో జరగనుందని ఆశ పెడుతూ బుజ్జగించేలా మాట్లాడారు. మాటలతో మాయపుచ్చే ప్రయత్నం చేశారు

ప్రత్యేక హోదా విషయంపై.. ఈ మధ్యన కేంద్రమంత్రి పార్లమెంటులో సమాధానం ఇస్తూ.. ఇప్పటికిప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని.. అలాంటి ఆలోచన కేంద్రం చేయటం లేదని తేల్చి చెప్పేయటం తెలిసిందే.

దీనిపై ఏపీలోని ప్రజలు.. రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండి పడటం తెలిసిందే. ఎవరికి వారు.. పోరాటాలు చేయటానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో బీజేపీ నేతల్ని సొంత నేతలే ప్రశ్నించే పరిస్థితి.

ఇదిలా ఉంటే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. కేంద్రం చెప్పిన మాటలు బీహార్ కు సంబంధించినవని.. ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదని నమ్మ బలికారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయంలో మాట్లాడిన ఆమె.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదన్న కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మాటలకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు

మంత్రిగారు చేసిన వ్యాఖ్యలన్నీ బీహార్ ను ఉద్దేశించిన చెప్పినవే తప్పించి.. ఆంధ్రాకు దాంతో సంబంధం లేదని.. అనవసరంగా ఏపీ ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దని వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తానికి ఏపీ ప్రజలకు మరోసారి తన మాటలతో పువ్వులు పెట్టేందుకు నిర్మలమ్మ చాలానే ప్రయత్నం చేశారన్న విమర్శ వినిపిస్తోంది.