హెచ్1బీ వీసాలపై ఆందోళన వద్దంటున్న కేంద్రం

Mon Mar 20 2017 19:27:26 GMT+0530 (IST)

హెచ్1బీ వీసాల-అక్రమ వలసల అంశంలో ఆందోళన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీసాల ఆందోళనపై స్పందించారు. ఆమె దీనిపై లోక్ సభలో సమాధానం ఇచ్చారు. హెచ్1బీ వీసాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతారామన్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై మాట్లాడుతూ వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఆ దేశంతో చర్చిస్తున్నట్లు ఆమె చెప్పారు. భారత్-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలపై బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి వేసిన ప్రశ్నకు కూడా కేంద్ర మంత్రి సీతారామన్ స్పందించారు. భారత్‌ను ఎటువంటి వాచ్‌లిస్టులో లేదన్నారు.

ఇదిలాఉండగా...వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 3 నుంచి హెచ్-1బీ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఎప్పటివరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా తొలి ఐదు వర్కింగ్ డేస్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2017 అక్టోబర్ 1 నుంచి యూఎస్ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. తాత్కాలికంగా హెచ్-1బీ దరఖాస్తులపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ఈ మధ్యే ప్రకటించినా.. మళ్లీ వెనక్కి తగ్గింది. అటు ప్రస్తుతానికి హెచ్-1బీ వీసా నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెప్పడం నిజంగా ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద ఊరటనిచ్చింది.

ప్రతి ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఈ మొత్తం 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ కాగా.. 20 వేల వీసాలను అమెరికా విద్యాసంస్థల్లో మాస్టర్స్ అంతకన్నా ఉన్నత చదువులు చదివిన విదేశీ విద్యార్థులకు జారీ చేస్తారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా తమ కంపెనీల్లో నియమించుకొనే అవకాశం హెచ్-1బీ వీసాల వల్ల కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. సైన్స్ ఇంజినీరింగ్ ఐటీ రంగాల్లో ఎక్కువగా హెచ్-1బీ వీసాదారుల అవసరం ఉంటుంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దరఖాస్తులను స్క్రూటినీ చేసి.. పరిమితి చేరుకోగానే మరో ప్రకటన జారీ చేస్తారు. ఇక ఫార్మ్ ఐ-129 ఫైల్ చేయడానికి ఉన్న ఫీజును ఈసారి 460 డాలర్లకు పెంచారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/