పాస్ పోర్ట్ రద్దయినా 4 దేశాలు చుట్టిన నీరవ్ మోడీ

Thu Jun 14 2018 12:58:34 GMT+0530 (IST)

నీరవ్ మోడీ పకడ్బందీగానే దేశంలో అప్పులు చేసి పారిపోయాడని మరోసారి తేటతెల్లమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేలకోట్ల స్కామ్ చేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నీరవ్ మోడీ చాకచక్యంగా తప్పించుకొని పలు దేశాలు తిరిగినట్టు విచారణలో వెల్లడైంది. రద్దయిన పాస్ పోర్టు మీదే నీరవ్ మోడీ  నాలుగుసార్లు మూడు దేశాలకు ప్రయాణించినట్లు సీబీఐకి ఇంటర్ పోల్ అధికారులు తెలిపారు. చివరిసారిగా ఆయన మార్చిలో విమానంలో రద్దయిన పాస్ పోర్ట్ తో ప్రయాణించినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 14న నీరవ్ మోడీకి సంబంధించిన పాస్ పోర్టును భారత విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది.పాస్ పోర్టు రద్దయినా కూడా నీరవ్ మోడీ మార్చి 15 నుంచి మార్చి 31 మధ్య అమెరికా యూకే హాంగ్ కాంగ్ ల మధ్య ప్రయాణించాడని తెలుపుతూ ఇంటర్ పోల్ అధికారులు సీబీఐ కి జూన్ 5న లేఖ రాశారు.

బ్యాంకులను ముంచేసిన నీరవ్ మోడీ పకడ్బందీగానే దేశం దాటి వెళ్లిపోయారు. ఆయనతో పాటు జనవరి మొదటి వారంలోనే నీరవ్ భార్య అమి - సోదరుడు నిషీల్ - మామ చోక్సీలు దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ యూకేలో - చోక్సీ అమెరికాలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు సింగపూర్ శాశ్వత పౌరుడిగా ఉండేందుకు నీరవ్ జనవరిలోనే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా నీరవ్ ను పట్టుకునేందుకు సీబీఐ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయాలని ఇంటర్ పోల్ ను కోరింది. నీరవ్ యూకేలో ఉన్నట్టు ఆ దేశ ప్రభుత్వం జూన్ 11న అధికారికంగా నిర్ధారించింది.