గుంటూరు ప్రముఖుడితో నీరవ్ మోడీకి లింక్?

Tue Mar 13 2018 13:13:04 GMT+0530 (IST)

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోడీ ఎపిసోడ్ లో కీలక పరిణామం వెలుగులోకి వస్తోంది. ఆయన లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీరవ్ ఉదంతాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా సంచనల విషయాన్ని పంచుకుంది. నీరవ్‌కు తెలుగు రాష్ట్రాల్లో లింక్ లున్నట్లు సీబీఐ దర్యాప్తులో బయటపడింది. ఆయనతో సంబంధం ఉన్న వారిపై..ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సంస్థలపై సీబీఐ దృష్టి సారించగా గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడి బంధం బయటపడింది.ముంబై..ఢిల్లీ నగరాలతో మోడీకి లింక్ ఉన్నట్లు భావించిన అధికారులు ఇతర రాష్ట్రాల్లో కూడా లావాదేవీలు జరిపాడా ? లేడా ? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నీరవ్ ఆర్థిక కలాపాలను ఆరా తీసే క్రమంలో సీబీఐ విచారణ జరుగుతుండగా గుంటూరులో జిల్లాలో ఓ ఆటోమొబైల్ సంస్థ డీలర్ తో నీరవ్ మోడీ సంబంధాలు పెట్టుకున్నట్లు నిర్ధారించింది. వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఆటో మొబైల్ డీలర్ కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇందులో కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఆ డీలర్ ను సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. కాగా తాజా పరిణామం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్ అయింది.