Begin typing your search above and press return to search.

రాజప్ప స్టయిల్ : ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!

By:  Tupaki Desk   |   20 Feb 2018 12:55 PM GMT
రాజప్ప స్టయిల్ : ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
X
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. అంటే.. తేడా గాడైన దొంగ పోలీసోడినే వెంటబడి తరిమాడని సామెత. ఏదైనా రివర్సు గేర్ లో వ్యవహారం నడుస్తోంటే ఇలా పోలుస్తారు. పోలీసు శాఖకే మంత్రి అయిన చిన రాజప్పగారి డైలాగులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. గురివింద నీతి లాగా.. ఆయన తాము - తమ అధినేత - తమ పార్టీ ఎక్కడెక్కడ ఎలాంటి కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయో.. ప్రజలు ఎవ్వరూ గుర్తించడం లేదని.. అనుకుంటూ ఉన్నారో ఏమో గానీ.. వైసీపీ మీద మాత్రం ‘కుమ్మక్కు’ ఆరోపణలను ముమ్మరంగా కురిపిస్తున్నారు.

‘కుమ్మక్కు’ ఎవరు- ఎవరితో సార్!

రాజకీయ విమర్శలకు ఈ కుమ్మక్కు అనే పదం కొత్తదేమీ కాదు. తమకు వ్యతిరేకంగా ఏ ఇద్దరు మాట్లాడినా సరే.. వాళ్లిద్దరూ కుమ్మక్కు అయిపోయినట్లు ప్రతి పార్టీ కూడా చెబుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే పనిచేస్తోంది. తెలుగుదేశం వ్యవహరిస్తున్న వైఖరిని ఇటు భాజపా - అటు వైసీపీ రెండూ తప్పు పడుతుండే సరికి వారిద్దరూ కుమ్మక్కయ్యారని తాటాకులు కట్టేయడానికి ప్రయత్నిస్తోంది.

అందుకు మంత్రి చినరాజప్ప చెబుతున్న కారణం మాత్రం చాలా చిత్రమైనది. వైఎస్సార్ కాంగ్రెస్ మోడీ సర్కారు మీద అవిశ్వాసం పెడతాం అని ప్రకటించినప్పటికీ కూడా .. జగన్ ను భాజపా నాయకులు పల్లెత్తు మాట అనడం లేదని పాపం.. ఆయన చాలా దిగులు పడిపోతున్నారు. విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం.. ఇది రీజన్ లేని ఆవేదన. ఎందుకంటే... జగన్ అవిశ్వాసం పెట్టినా కూడా.. మోడీ సర్కారు కు పోయేదేమీ లేదనే స్పష్టత భాజాపాకు ఉన్నప్పుడు.. అనవసరమైన ఆందోళనతో నోరు పారేసుకోవాల్సిన అవసరం వారికేమిటి? అనేది సామాన్యుల సందేహం.

అదే సమయంలో అసలు పవన్ కల్యాణ్ తో తమకున్న కుమ్మక్కు రాజకీయాలను మాత్రం చినరాజప్ప చాలా సౌమ్యంగా డీల్ చేస్తున్నారు. పవన్ మద్దతు కూడగడతానని చెప్పిన నేపథ్యంలో ఆ తేదీల్లో అవిశ్వాసం పెట్టి జగన్ నిబద్ధత నిరూపించుకోవాలని రాజప్ప అంటున్నారు. అయితే.. జగన్ ఎప్పుడు అవిశ్వాసం పెడితే అప్పుడు మద్దతు కూడగట్టి పవన్ కూడా తన నిబద్ధత నిరూపించుకోవాలని మాత్రం రాజప్ప అనలేకపోతుండడం గమనార్హం. పవన్ మీద మాట జారడానికి వీల్లేదని తమ అధినేత స్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలో, ఆయనతో తమ కుమ్మక్కు సంగతి దాచుకుంటూ.. ఎదుటి వారి మీద మాత్రం కుమ్మక్కు బురద చల్లుతూ రాజప్ప భలే రాజకీయం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.