Begin typing your search above and press return to search.

బాబు స్వాహా.. వచ్చే ప్రభుత్వానికి కష్టమే

By:  Tupaki Desk   |   23 April 2019 9:39 AM GMT
బాబు స్వాహా.. వచ్చే ప్రభుత్వానికి కష్టమే
X
చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి అలివి కాని హామీలిచ్చాడు. చివరి నిమిషంలో పథకాల పేరిట ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టేశారు. ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఏపీ ఖజానా పెట్టే ఖాళీ అయిపోయింది. బాబు అస్తవ్యస్త విధానాలతో ఏపీ రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుదేలైందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తయారైందని సీనియర్ ఐఏఎస్ లు వాపోతున్నారు.

బాబు హామీలు తీర్చడానికి ఏపీ ఖజానాను గుల్ల చేయడంతో ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన 14వేల కోట్ల రూపాయల బిల్లులను అధికారులు పెండింగ్ లో పెట్టారు.మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ.8వేల కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ తిరస్కరించింది.

ఇక గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకుండా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోకి మార్చేశారు. మొత్తంగా ప్రస్తుతం 22వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ఈ ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. గతేడాది కేంద్రం నుంచి వచ్చిన రూ.4వేల కోట్ల నిధులు ఇతర అవసరాలకు మళ్లించారని.. ఇప్పుడు ఆ నిధులను ఈ ఆర్ధిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఓట్ల కోసం ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా ఎన్నికల వేళ ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నారు.

పోయిన ఏడాది బిల్లులు కూడా రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏపీ సచివాలయం, ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. కార్పొరేషన్ల నిధులు, గ్రామీణాభివృద్ధి సెస్ సహా బడ్జెట్ లో కేటాయింపులు పక్కన పెట్టి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు పెట్టారని ఆర్థిక శాఖ అధికారులు వాపోతున్నారు. వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు కూడా నిధులు లేవని అధికారులు చెబుతున్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఖాళీచేయించిన బడ్జెట్ ను చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే చంద్రబాబు ఓవర్ డ్రాఫ్ట్ కు మూడు సార్లు వెళ్లారని.. ఖజానా ఎంత దిగజారిందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చంటున్నారు.