Begin typing your search above and press return to search.

వాళ్ల‌కు రాష్ట్రాలు ఛాయిస్ కాదు.. జోన్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:20 AM GMT
వాళ్ల‌కు రాష్ట్రాలు ఛాయిస్ కాదు.. జోన్లేన‌ట‌!
X
దేశంలో అత్యుత్త‌మ స‌ర్వీస్ గా అభివ‌ర్ణించే సివిల్ స‌ర్వీస్ అధికారుల‌కు సంబంధించి కేంద్రం ఒక ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకుంది. సివిల్ స‌ర్వీస్ లుగా చెప్పే ఐఏఎస్ (ఇండియ‌న్ ఆడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌).. ఐపీఎస్ (ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్‌).. ఐఎఫ్ ఓఎస్ (ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్) స‌ర్వీసుల్లో చేరాల‌నుకునే వారు ఇక‌పై త‌మ‌కు న‌చ్చిన రాష్ట్రాల ఛాయిస్ ను ఎత్తేసి.. కొత్త‌గా ఏర్పాటు చేసే జోన్ల‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది.

కేడ‌ర్ల కేటాయింపులో నూతన విధానాన్ని మోడీ స‌ర్కారు తెర మీద‌కు తీసుకొచ్చింది. సివిల్ స‌ర్వీస్ అధికారుల్లో జాతీయ స‌మ‌గ్ర‌త భావాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. కొత్త నిర్ణ‌యం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న 26 కేడ‌ర్ల‌ను.. 5 జోన్లుగా మార్చ‌నున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల క్యాడ‌ర్ల‌ను ఐదు జోన్లుగా మార్చారు. అభ్య‌ర్థులు త‌మ‌కు న‌చ్చిన క్యాడ‌ర్ గా ఎంపిక చేసుకోవ‌టానికి మూడు జోన్ల నుంచి మూడు రాష్ట్రాల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

తాజా మార్పుతో సివిల్ స‌ర్వీస్ లో చేరాల‌నుకునే వారికి త‌మ‌కు న‌చ్చిన రాష్ట్రాల్ని ఎంపిక చేసుకునే విష‌యంలో చాయిస్ త‌గ్గిపోతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఈ కొత్త విధానంలో ఒకే జోన్ లోని రెండు రాష్ట్రాల్ని త‌మ‌కు న‌చ్చిన రాష్ట్రాల జాబితాగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండ‌దు. తాజా విధానంతో త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేని రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీసెస్‌ కు ఎంపిక‌య్యే అధికారులు ప‌ని చేసే అవ‌కాశం క‌లగ‌నుంది.

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు మొద‌ట త‌మ ఛాయిస్ ను పేర్కొనాల్సి ఉంటుంది. త‌మ ప్రాధాన్య‌త జోన్ల‌ను వారు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక‌సారి ఎంపిక చేసుకున్న త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్పుల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. కొత్త విధానంలో సివిల్ స‌ర్వీసెస్ ను ఎంపిక చేసుకునే వారికి తమ‌కు న‌చ్చిన రాష్ట్రాల్లో ప‌ని చేసే ఛాయిస్ త‌గ్గిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. కొత్త‌గా ఏర్పాటు చేసిన 5 జోన్ల‌లో ఏయే రాష్ట్రాలు వ‌స్తాయంటే..

జోన్ 1
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గోవా.. మిజోరాం.. జ‌మ్ముకశ్మీర్‌..హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. ఉత్త‌రాఖండ్‌..పంజాబ్‌.. రాజ‌స్తాన్‌.. హ‌ర్యానా.. కేంద్ర‌పాలిత ప్రాంతాలు

జోన్ 2
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. బిహార్‌.. జార్ఖండ్‌.. ఒడిశా

జోన్ 3
గుజ‌రాత్.. మ‌హారాష్ట్ర.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌

జోన్ 4
ప‌శ్చిమ‌బెంగాల్‌.. సిక్కిం.. అస్సాం.. మేఘాల‌య‌.. మ‌ణిపూర్‌.. త్రిపుర‌.. నాగాలాండ్‌

జోన్ 5
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. తెలంగాణ‌.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌