Begin typing your search above and press return to search.

విజ‌య్ సూసైడ్‌ లో సంచ‌ల‌న విష‌యాలు

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:56 AM GMT
విజ‌య్ సూసైడ్‌ లో సంచ‌ల‌న విష‌యాలు
X
సంచ‌ల‌నంగా మారిన సినీ న‌టుడు విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌పై కొత్త కొత్త ఆరోప‌ణ‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌పై అత‌డి స‌తీమ‌ణి వ‌నిత తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌గా.. ఆమెపై విజ‌య్ సాయి తండ్రి మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఇద్ద‌రి వ్యాఖ్య‌ల‌కు తోడు అన్న‌ట్లుగా వ‌నిత సోద‌రుడు త‌న బావ‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఇలా ప‌ర‌స్ప‌ర నిందారోప‌ణ‌ల‌తో విజ‌య్ సాయి సూసైడ్ వ్య‌వ‌హారం ఇప్పుడు కొత్త మ‌లుపులు తిరుగుతోంది.

ఒక‌వైపు విజ‌య్ సాయి మృత‌దేహానికి ఎర్ర‌గ‌డ్డ శ్మ‌శానవాటిక‌లో అంత్య‌క్రియ‌లు చేశారు. ఇదిలా ఉంటే.. విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకొని విజ‌య్ త‌ప్పు చేశాడ‌ని ఆరోపించారు ఆయ‌న స‌తీమ‌ణి వ‌నిత‌. అత‌డింత పిరికివాడ‌ని తాను అనుకోలేద‌ని.. తాను త‌ప్పు చేస్తే శిక్ష అనుభ‌విస్తాన‌న్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసే వారు త‌న కుమార్తె భ‌విష్య‌త్తు గురించి ఆలోచించాల‌న్నారు.

నిజాలు కోర్టులో తేలుతాయంటూ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. త‌న‌ను బ‌లిప‌శువును చేయ‌టానికి మామ సుబ్బారావు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ఆమె.. విజ‌య్‌ కు.. ఆయ‌న తండ్రికి ఒక ల్యాండ్ విషయంలో వివాదం ఉంద‌న్నారు. దీని కార‌ణంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉండొచ్చాన్నారు. ఇదిలా ఉంటే.. వ‌నిత‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు విజ‌య్ సాయి తండ్రి సుబ్బారావు.

వ‌నిత క్యారెక్ట‌ర్ మంచిది కాద‌ని.. మొద‌టి భ‌ర్త‌కు ఆమె మోసం చేసింద‌న్నారు. ఆమెకు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని.. సరైన స‌మ‌యంలో వాటిని విడుద‌ల చేస్తాన‌న్నారు. త‌న కొడుకుతో త‌న‌కు ఎలాంటి గొడ‌వ‌ల్లేవ‌న్నారు. చ‌నిపోయే ముందు వ‌ర‌కూ త‌న‌తో సంతోషంగా ఉన్నాడ‌న్న ఆయ‌న‌.. త‌న మ‌న‌మ‌రాలి విష‌యంలో కోర్టు ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌న్నారు.

ఇంకోవైపు వ‌నిత సోద‌రుడు సీన్లోకి వ‌చ్చాడు. త‌న బావ తీరు మంచిది కాద‌ని.. అత‌నికి చాలామంది అమ్మాయిల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని బావ‌మ‌రిది రామ‌చంద్రారెడ్డి ఆరోపించారు. త‌న అక్క వ‌నిత‌పై నింద‌లు వేస్తున్నార‌న్నారు. బ్యాచిల‌ర్ మూవీ టైంలో విజ‌య్ తో త‌మ సోద‌రి ప్రేమ‌లో ప‌డ్డార‌న్నారు. వీరి పెళ్లిని ఇరు కుటుంబాల వారు ఒప్పుకోక‌పోవ‌టంతో యాద‌గిరి గుట్ట‌లో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న‌ట్లు చెప్పారు. పెళ్లైన కొద్దిరోజుల‌కే వ‌నిత‌కు.. విజ‌య్ కు విభేదాలు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మ‌రెన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో?