Begin typing your search above and press return to search.

కొత్త ట్విస్ట్‌!... జ‌య‌రాం అప్పే తీసుకోలేద‌ట‌!

By:  Tupaki Desk   |   14 Feb 2019 8:40 AM GMT
కొత్త ట్విస్ట్‌!... జ‌య‌రాం అప్పే తీసుకోలేద‌ట‌!
X
కోస్ట‌ల్ బ్యాంకు డైరెక్ట‌ర్‌, ఎక్స్‌ ప్రెస్ టీవీ ఓన‌ర్‌గా చిర‌ప‌ర‌చితులైన‌ ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హ‌త్య కేసు మిస్ట‌రీల‌కే మిస్ట‌రీగా మారుతోంది. అప్పు వ‌సూలు చేసుకోవ‌డంలో భాగంగా నిందితుడు కొట్టిన దెబ్బ‌ల‌కు జ‌య‌రాం ప్రాణాలు విడిచారని ఇప్ప‌టిదాకా అనుకుంటున్న విషయ‌మంతా ఒట్టి ట్రాషేన‌ట‌. అస‌లు జ‌య‌రాం అప్పే తీసుకోలేద‌ని, ఆయ‌నను ట్రాప్ చేసి బెదిరించి డ‌బ్బు గుంజుదామన్న ఉద్దేశ్యంతోనే నిందితుడు రాకేష్‌ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టుగా కొత్త వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ కేసును ఏపీ పోలీసుల నుంచి బ‌ద‌లాయించేసుకున్న తెలంగాణ పోలీసులు... నిందితుడు రాకేశ్ రెడ్డితో పాటు అత‌డికి స‌హ‌క‌రించిన శ్రీ‌నివాస్‌ల‌ను త‌మ క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వస్తున్నాయి.

బెదిరింపులతో జయరాం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన‍్న పథకంతోనే రాకేష్‌ రెడ్డి ఆయ‌న‌ను ట్రాప్‌ చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం హైదరాబాద్‌ కు చెందిన ప‌లువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను అత‌డు రంగంలోకి దింపి, వాళ్లు తనకు అప్పుగా డబ్బు ఇచ్చినట్లు రాకేష్‌ రెడ్డి త‌ప్పుడు సాక్ష్యాలు సృష్టించాడు. అంతేకాకుండా జయరాం హత్యకు అత‌డికి కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సహరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేర‌కు విచార‌ణ‌లో రాకేష్ రెడ్డి వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు చింతల్ కు చెందిన ఓ రౌడీ షీటర్‌ తో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులను వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదిలా ఉంటే... జయరాంను హత్య చేసిన తర్వాత కొన్ని గంటలపాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే రాకేష్‌ సంచరించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడు 11మంది పోలీస్‌ అధికారులతో టచ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం వారితో అతడు ఫోన్‌ లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడి కాగా, వారిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్‌ స్పెక్టర్లు కూడా ఉన్నారు. దీంతో పోలీస్‌ అధికారుల పాత్రపై కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిగే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టిదాకా రాకేష్ రెడ్డికి స‌హ‌క‌రించిన పోలీసులు అధికారులు ఇద్ద‌రేన‌ని తెలియ‌గా... ఇప్పుడు ఆ సంఖ్య 11గా వినిపిస్తుండ‌టంతో ఈ కేసు విచార‌ణ పెను సంచ‌ల‌నంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.