Begin typing your search above and press return to search.

ఈసారి కోడి పందేల్లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   10 Jan 2017 7:02 AM GMT
ఈసారి కోడి పందేల్లో కొత్త కోణం
X
సంక్రాంతి వస్తుందంటే చాలు..ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పల్లె కొత్త శోభను సంతరించుకుంటాయి. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రాలో సంక్రాంతి సందడి చాలా ఎక్కువ. తెలంగాణ వారికి దసరా ఎంత ముఖ్యమో.. ఆంధ్రావారికి సంక్రాంతి అంత ముఖ్యం. పే..ద్ద పండగ్గా అనుకోవటమే కాదు.. ఏకంగా మూడు రోజుల బ్యాక్ టు బ్యాక్ పండగ సందడి సంక్రాంతి సొంతం.

సంక్రాంతి పండక్కి ఇంటి ముందు ముగ్గుల హడావుడి.. ఇంట్లో వంటల జోరు ఎంతో.. గ్రామాల్లో కోడి పందాల మీద ఆసక్తి అంతే ఎక్కువగా ఉంటుంది. మరీ.. ముఖ్యంగా కోస్తా.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసే కోడి పందేల కోసం ఏడాది మొత్తం కసరత్తు జరుగుతూ ఉంటుంది. అయితే..ఈసారి పందేల విషయంలో హైకోర్టు నో అని చెప్పేయటం.. పందేలు జరగకుండా చూస్తామని ఏపీ అధికారులు చెప్పటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. కోడి పందేలపై రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టటం.. ఈ పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. కోళ్లకు కట్టే కత్తులు స్వాధీనం చేసుకొని పుంజులను వదిలేయాలంటూ పోలీసులకు మార్గదర్శనం చేయటంతో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్న వాదనను పలువురు వినిపిస్తున్నాయి. అయితే.. కోడి పందేలు జరపొచ్చన్న మాటను సుప్రీంకోర్టు సూటిగా చెప్పలేదన్న విషయాన్ని అధికారులు చెబుతున్నారు.

పందేలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు సూటిగా చెప్పనప్పటికీ.. అధికారులు పందేల మీద నిషేధం ఉందని చెబుతున్నప్పటికి.. కోస్తా.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జోరుగా సాగిపోతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది గోదావరి జిల్లాల్లో చిన్నా.. పెద్దా కలిపి 250 బరుల్లో పందేలు సాగాయి. ఈసారి అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాది బరుల్లో అధికార.. విపక్షాలకు సంబంధించి వేర్వేరుగా ఉండేవి. అయితే.. ఈసారి యాంగిల్ మారిందని చెబుతున్నారు.

ఎప్పుడూ లేని రీతిలో కులాలు.. వర్గాల ప్రాతిపదికన కోళ్ల పందేలు జరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివి ఇప్పటివరకూ జరగలేదని.. ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అదే జరిగితే.. గ్రామాల్లో సరికొత్త ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ఈసారి కోడి పందేల నిర్వహణపై సర్వత్రా ఉత్కంట నెలకొందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/