ఊరూపేరు లేని సర్వేలు.. ఊరంతా చర్చలు

Sun Mar 18 2018 21:48:12 GMT+0530 (IST)

తెలుగు రాష్ట్రాల రాజకీయం రసకందాయంలో పడడంతో పాటు ఇక్కడి ముఖ్య నేతలు జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతుండడంతో సోషల్ మీడియా హడావుడిగాళ్లు.. క్లిక్ బైట్ సైట్లు కూడా ఈ రాజకీయాల చుట్టూ తోచిన రీతిలో వార్తలల్లేస్తున్నాయి. అందులో భాగంగానే సర్వేల పేరుతోనూ కాకిలెక్కలను జనం మీదకు వదులుతున్నాయి. కొందరైతే.. ఫేస్‌బుక్ - ట్వివటర్లో ఉన్న సర్వే ఆప్షన్ ఉపయోగించి .. దానికి స్పందించిన పది మందో.. పాతిక మందో అభిప్రాయాన్నే జనాభిప్రాయంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఒక సర్వే రిపోర్టు వాట్సాప్‌లో అందరి ఫోన్లలో వచ్చి పడుతోంది. అందులో చెబుతున్న ఫలితాలు వాస్తవ పరిస్థితులకు  దగ్గరగా ఉండడంతో మరింత వేగంగా అది వ్యాప్తి చెందుతోందొ.ఎవరు చేశారు.. ఎప్పుడు చేశారు.. అనేదేమీ లేకుండానే నేషనల్ సర్వే పేరుతో ఇది వాట్సాప్‌లో తిరుగుతోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది ఇందులో ఉంది. అంతేకాదు.. రెండు స్టేట్లలో అధికార పార్టీల గెలుపు అసాధ్యమని ఈ లెక్కలు చెబుతున్నాయి.  చంద్రబాబు - కేసీఆర్ కలలు కంటున్న ఫ్రంట్ కూడా ఏమాత్రం పనికిరాదని ఇది తేల్చేసింది.

ఏపీలో చంద్రబాబు బలం 60సీట్ల కంటే తక్కువకు పడిపోతుందని..  ఏపీలో మెజారిటీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుందని.. దాదాపు వంద సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక మిగిలిన సీట్లను పవన్ కల్యాణ్.. ఒకవేళ కూటమిగా పోటీ చేస్తే కమ్యూనిస్టు పార్టీలు సొంతం చేసుకోగలవని తేల్చింది.

తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అని ఈ సర్వే తేల్చింది. టీఆరెస్ కు సొంతంగా 50 సీట్ల వరకూ వస్తాయట.  కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ కోలుకున్నా.. అధికారాన్ని సంపాదించుకోవడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ 45సీట్ల వరకూ సాధించుకోవచ్చని అంచనా వేసింది. మొత్తానికైతే ఈ సర్వే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా కనిపిస్తున్నా ఎవరు చేశారన్నది లేకపోవడంతో రాజకీయ మేధావి వర్గాలు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు.