Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన కరెన్సీ నోట్ల కొరత

By:  Tupaki Desk   |   2 Dec 2016 3:49 AM GMT
షాకింగ్ గా మారిన కరెన్సీ నోట్ల కొరత
X
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర నోట్ల సమస్య తెర మీదకు వచ్చింది. పెద్దనోట్లను రద్దు చేసిన ప్రధాని మోడీ.. అంతకు మించిన పెద్దనోటును మార్కెట్లోకి తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. పెద్దనోట్లతో బ్లాక్ మనీ కుప్పలు కుప్పలుగా పోగుపోస్తారన్న వాదనను వినిపిస్తూనే.. ఇప్పటికే వినియోగంలో ఉన్న అధిక మొత్తంతో ఉండే వెయ్యి నోటుపై వేటు వేసి.. రూ.2వేల నోటును వినియోగంలోకి తీసుకొచ్చారు.

దీంతో.. చిల్లర కష్టాలు ఇంతింత కాదయా అన్నట్లుగా మారింది. వంద రూపాయిల నోటు తర్వాత రూ.2వేల నోటు మాత్రమే ఉండటంతో ఎవరికీ ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. ఈ చిల్లర కొరత ఒకవైపు పట్టి పీడుస్తుంటే.. మరోవైపు అంతకుమించిన సమస్య తెర మీదకు వచ్చింది. కరెన్సీ నోట్ల కొరత అంతకంతకూ పెరిగిపోతోంది. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటమే తప్పించి.. బ్యాంకుల నుంచి బయటకు వస్తున్న మొత్తం చాలా స్వల్పంగా ఉండటంతో.. జనం నోట్ల కోసం బ్యాంకుల బయట పడిగాపులు కాయాల్సి వస్తోంది.

నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఒకరు తమ ఖాతాల నుంచి డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవాలనుకుంటే వారం వ్యవధిలో రూ.24వేల వరకూ విత్ డ్రా చేసుకునే వీలుంది. కానీ.. అందుకు భిన్నంగా బ్యాంకులు తమ వద్ద నగదు కొరత చాలా ఎక్కువగా ఉందని.. తాము రూ.24వేలను ఒక్కసారిగా ఇవ్వలేమని చెబుతూ.. రూ.2వేల నుంచి రూ.4వేల మొత్తాన్ని మాత్రమే ఇస్తున్నారు. చాలా బ్యాంకుల్లో రూ.2వేలు మాత్రమే ఇవ్వటం.. అది కూడా రెండు వేల నోట్లు ఇవ్వటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం రూ.2వేల మొత్తాన్ని.. రూ.100 నోట్లను ఇస్తున్నారు.

నోట్లకొరత ఇంత ఎక్కువగా ఎందుకు ఉందన్న విషయంలోకి వెళితే.. కరెన్సీ నోట్లను విడుదల చేయకపోవటమే కారణంగా చెప్పాలి. వీలైనంత వరకూ నోట్ల లభ్యతపై ఆర్ బీఐ పట్టుబిగిస్తోందన్న మాటను కొందరు బ్యాంకర్లు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఒక ప్రైవేటు బ్యాంకు బ్రాంచ్ కు రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల మొత్తాన్ని మాత్రమే పంపుతున్న ఉన్నతాధికారులు.. విత్ డ్రా మీద వీలైనంత టైట్ పెట్టాలన్న మాటను చెబుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. నోట్ల కొరతకు సంబంధించిన గణాంకాల్ని చూస్తే.. కొరత తీవ్రంత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే తెలుస్తుంది.

పెద్దనోట్ల రద్దు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.40వేల కోట్ల రూపాయిల డిపాజిట్లు జరిగినట్లు చెబుతున్నారు. వీటిల్లో గ్రామీణ ప్రాంతాల్లోని బ్యంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం రూ.11వేల కోట్ల వరకూ ఉందని చెబుతున్నారు.ఇంత భారీమొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయితే.. రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన నగదు కేవలం రూ.1200 కోట్లు మాత్రమే. ఇక.. గ్రామీణ ప్రాంతాలకు పంపిన మొత్తం కేవలం రూ.500 కోట్లు మాత్రమే.

వేలాది కోట్లు బ్యాంకు అకౌంట్లో ప్రజలు డిపాజిట్లు చేయటమే తప్పించి.. రిజర్వ్ బ్యాంకు నుంచి నోట్లు రాకపోవటం.. విత్ డ్రా మీద అప్రకటిత పరిమితులు భారీగా ఉండటంతో చేతికి నోటు రాని పరిస్థితి. నోట్లతోనే లావాదేవీలు జరిపే అలవాటున్న ప్రజలకు..తాజా పరిణామం మహా ఇబ్బందికరంగా మారింది. జేబులోని పర్సులో నోట్లతో నిండుగా ఉండే ఆత్మవిశ్వాసానికి.. కార్డుల్లో డబ్బులు ఉంటే ఉండే ధీమాకు వ్యత్యాసాన్ని మోడీ పరివారం సరిగా కొలవలేదన్న వన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/