Begin typing your search above and press return to search.

బాబు సొంతూరు ఆసుప‌త్రి గుట్టు విప్పిన కామినేని!

By:  Tupaki Desk   |   16 Jan 2018 10:08 AM GMT
బాబు సొంతూరు ఆసుప‌త్రి గుట్టు విప్పిన కామినేని!
X
బాబు సొంతూరు నారావారిప‌ల్లె అన్న విష‌యం తెలిసిందే. ఆ ఊళ్లో జ‌నాభా ఎంత‌? అన్న కుతూహ‌లంతో నెట్ బ్రౌజ్ చేస్తే.. కాస్త క‌స‌ర‌త్తు చేశాక‌.. కొన్ని వెబ్ సైట్లు తిరిగి చూసిన త‌ర్వాత తేలిన లెక్కేందంటే రెండు వేల మంది ఉంటార‌ని. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని చంద్ర‌గిరి మండ‌లంలో చిన్న గ్రామం నారావారి పల్లె.

ముఖ్య‌మంత్రి సొంతూరు కావ‌టంతో.. అత్యాధునికంగా క‌నిపించే ఆసుప‌త్రికి ఏర్పాటు చేయాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. అందుకు త‌గ్గ‌ట్లే.. అదిరిపోయే హంగుల‌తో బిల్డింగ్ పూర్తి అయ్యింది. చూసినంత‌నే అసూయ పుట్టేలా ఆసుప‌త్రిని డిజైన్ చేశారు. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ.6 కోట్లు ఖ‌ర్చు పెట్టింది.

ఈ ఆసుప‌త్రిని ఏర్పాటు చేసిన స్థ‌లం బాబు త‌ల్లిదండ్రులుగా అక్క‌డి శిలాఫ‌ల‌కం చెబుతోంది. ఈ రోజు ప్రారంభించ‌నున్న ఈ ఆసుప‌త్రిని చూస్తే.. పెద్ద పెద్ద ఊళ్లోళ్లు సైతం.. అరే.. మ‌న‌కు ఇలాంటి ఆసుప‌త్రి లేకుండా పోయిందే? ఆ చంద్ర‌బాబు ఏదో మా ఊళ్లో పుడితే బాగుండు క‌దా అని స‌గ‌టు జీవికి అనిపించేలా భారీ భిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఆసుప‌త్రి ముచ్చ‌ట లోతుల్లోకి వెళితే.. అస‌లు సంగ‌తి తెలుస్తుంది.

రెండు వేల మంది ఉంటే గ్రామానికి రూ.6 కోట్ల‌తో ఆసుప‌త్రి వ‌ద్ద‌ని చెప్పం. కానీ.. రాష్ట్రంలో ఎన్ని గ్రామాల‌కు అలాంటి ఆసుప‌త్రులు ఉన్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. ముఖ్య‌మంత్రి సొంతూరుకు స‌రైన ఆసుప‌త్రి లేద‌ని మీరే ఎట‌కారం చేస్తారు.. మ‌ళ్లీ అదే నోటితో మంచి ఆసుప‌త్రి క‌ట్టించిన త‌ర్వాత కూడా విమ‌ర్శిస్తారా? అన్న ఆగ్ర‌హం కొంద‌రికి క‌ల‌గొచ్చు.

కానీ.. ఇక్క‌డ పాయింట్ ఏమిటంటే.. రూ.6కోట్ల ప్ర‌జాధ‌నంతో ఆసుప‌త్రి బిల్డింగ్ క‌ట్ట‌గానే స‌రిపోదు. అందులో ఉండే వైద్య స‌దుపాయాల మాటేమిటి? అక్క‌డ ప‌ని చేసే డాక్ట‌ర్ల మాటేమిటి? లాంటి ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా వేసుకుంటూ పోతే.. ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ కన్నా.. మ‌ల్టీ ఫ్లెక్స్ బిల్డింగ్ మాదిరి క‌నిపించే ఆసుప‌త్రి మొయింటైన్స్ కే ఎక్కువ ఖ‌ర్చు అవుతుంద‌న్న‌దే పాయింట్‌.

2 వేల మంది కంటే ఎక్కువ జ‌నాభా లేని గ్రామానికి డాక్ట‌రు వ‌స్తారా? వ‌చ్చినా అక్క‌డ ఉంటారా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సీఎం సొంతూరు కావ‌టంతో ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పినా.. ఆసుప‌త్రిలో వైద్య స‌దుపాయాలు పెద్ద‌గా లేవ‌న్న‌ది టాక్‌. రూ.6కోట్ల వ్య‌యంతో ఇంత భారీ బిల్డింగ్ ఎలా క‌ట్టార‌న్న డౌట్ బిల్డింగ్ చూసినోళ్ల‌కు.. స్థానిక విలేక‌రుల‌కు క‌లిగింది. ఈ సంందేహాన్ని తీర్చేశారు ఏపీ మంత్రి కామినేని శ్రీ‌నివాస‌రావు.

ఆసుప‌త్రి బిల్డింగ్ క‌ట్టే కాంట్రాక్ట‌ర్‌కు ముందే హెచ్చ‌రించామ‌ని.. నాణ్య‌త‌లో తేడా వ‌స్తే ఊరుకోమ‌ని.. క‌మిష‌న్ల‌తో నిదుల్ని క‌రిగించే ప్ర‌య‌త్నం చేస్తే.. విజిలెన్స్ లాంటి సంస్థ‌లు రంగంలోకి దిగుతాయ‌ని తీవ్రంగా హెచ్చ‌రించిన‌ట్లుగా చెప్పారు. విష‌యం అర్థ‌మైందా? అదేనండి.. మిగిలిన సంగ‌తి మాకు తెలీదు. ఇది సీఎంగారి సొంతూర్లో చేస్తున్న ప్రాజెక్టు.. ఇక్క‌డ కానీ క‌క్కుర్తి ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది.. అదే మ‌న‌సు దోచేలా క‌ట్టావ‌నుకో.. భ‌విష్య‌త్తులో మంచి ఛాన్స్ చిక్క‌టం ఖాయ‌మ‌ని చెప్పి ఉంటారు. ఫ్యూచ‌ర్ మీద ఆశ‌తో ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని కమిష‌న్ల క‌క్కుర్తికి పోకుండా ఉండ‌టంతోనే ఇంత భారీ బిల్డింగ్ అందుబాటులోకి వ‌చ్చి ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి అదిరిపోయేలా క‌నిపించిన నారావారిప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వెనుక క‌థ చాలానే ఉన్న‌ట్లుంది క‌దూ?