Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల‌కు బాస్ లు ఫిక్స్ అయ్యారా?

By:  Tupaki Desk   |   28 July 2017 3:30 AM GMT
చంద్రుళ్ల‌కు బాస్ లు ఫిక్స్ అయ్యారా?
X
తెలుగు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లకు సంబంధించి గ‌డిచిన కొంత‌కాలంగా ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అనుస‌రిస్తున్న రీతిలోనే రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ను ఎంపిక చేస్తార‌న్న అభిప్రాయం బ‌లంగా వ్య‌క్త‌మైంది. ఏపీలో రాజ్ భ‌వ‌న్ లేక‌పోవ‌టం.. గ‌వ‌ర్న‌ర్ కు అవ‌స‌ర‌మైన ప్రాధ‌మిక సదుపాయాలు లేని నేప‌థ్యంలో మ‌రికొంత కాలం రెండు తెలుగు రాష్ట్రాల‌కు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్లు అవ‌స‌రం లేద‌ని.. ఒక్క‌రితోనే బండి న‌డిపించొచ్చ‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లుగా వాద‌న‌లు వినిపించాయి.

అయితే.. ఇందుకు భిన్న‌మైన ఆలోచ‌న‌ల్లో కేంద్రం ఉందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే దిశ‌గా మోడీ స‌ర్కారు ఆలోచిస్తుంద‌న్న వాద‌న ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఇప్ప‌టికే పూర్తి అయ్యింద‌ని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టంతో పాటు.. అందుకు సంబంధించి ఎవ‌రిని ఎంపిక చేస్తే బాగుంటుంద‌న్న అంశంపైనా ఎంపిక పూర్తి అయ్యింద‌ని చెబుతున్నారు.

గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి ఆనందీబెన్ ఏపీ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా.. తెలంగాణ‌కు క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ నేత‌.. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ డీహెచ్ శంక‌ర‌మూర్తిని గ‌వ‌ర్న‌ర్ గా ఎంపిక చేయాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. విభ‌జ‌న‌కు ముందు నుంచి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ రెండో ద‌ఫా ప‌ద‌వీకాలం గ‌త మార్చితోనే ముగిసింది. అయితే.. న‌ర‌సింహ‌న్ విష‌యంలోప్ర‌ధాని మోడీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించాలా? న‌ర‌సింహ‌న్‌ను మ‌రోమారు అవ‌కాశం ఇవ్వాలా? అన్న విష‌యం మీద స్ప‌ష్ట‌త లేని నేప‌థ్యంలో త‌దుప‌రి ఆదేశాలు జారీ అయ్యే వ‌ర‌కూ ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా రాష్ట్రప‌తిగా రామ్ నాథ్ కోవింద్ ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు ఢిల్లీకి వ‌చ్చిన ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని కేంద్రం అందించిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. రెండు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాలంటే విభ‌జ‌న చ‌ట్టానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా? అన్న అంశంపై కొంత సందిగ్థ‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఆ అంశాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చాక నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కారు విజ‌య‌వాడ‌కు వెళ్లి త‌మ పాల‌న తాము చేసుకుంటున్న వేళ‌.. ఏపీకి వేరుగా గ‌వ‌ర్న‌ర్‌ ను ఏర్పాటు చేయ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా స‌మాచారం.