Begin typing your search above and press return to search.

అయ్య‌ప్ప అంటే అంత భ‌క్తి అయితే శ‌బ‌రిమ‌లే వెళ్లాలా?

By:  Tupaki Desk   |   19 Oct 2018 4:56 AM GMT
అయ్య‌ప్ప అంటే అంత భ‌క్తి అయితే శ‌బ‌రిమ‌లే వెళ్లాలా?
X
వామ్మో.. వామ్మో కామ్రేడ్ లు ఇంత క‌ఠినంగా ఉంటారా? అంటూ గుండెలు బాదేసుకుంటున్నారు అయ్య‌ప్ప భ‌క్తులు. కామ్రేడ్ ల‌కు దేవుడు..ద‌య్యాలు లాంటివి పట్ట‌వ‌ని.. మిగిలిన మ‌త విశ్వాసాల విష‌యంలో ఎలా ఉన్నా.. హిందూ ప్ర‌జ‌ల మ‌త విశ్వాసాల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు వేలెట్టి.. ఆగ‌మాగం చేసే అల‌వాటు వారికి ఎక్కువ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి శ‌బ‌రిమ‌ల‌లో కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిందే. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ఆచార వ్య‌వ‌హారం ఉంటుంది. అదే స‌మ‌యంలో శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యానికి సంబంధించిన ఒక నియ‌మం ఎప్ప‌టి నుంచో ఉంది. కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని శ‌బ‌రిమ‌ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌టానికి చూపించే కార‌ణాల్ని చాలామంది కాద‌న‌లేరు.

అయినా.. దేవుడు అన్న‌ది ఒక న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కాన్ని న‌మ్మే వారు..అక్క‌డి సంప్ర‌దాయాల్ని.. ప‌ద్ద‌తుల్ని గౌర‌విస్తారు. ఒక‌వేళ‌.. అలాంటి న‌మ్మ‌కాల‌పై స‌ద‌భిప్రాయం లేన‌ప్పుడు.. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవస‌రం లేదు. నిజంగా అయ్య‌ప్పస్వామిని ఆరాధించ‌టం అంటే ఆస‌క్తి ఉన్న మ‌హిళ‌లు.. అన్ని ఊళ్ల‌ల్లో ఉండే అయ్య‌ప్ప‌ను కొలిచే వీలుంది. వారికి ఉన్న అడ్డంకి అంతా ఒక్క శ‌బ‌రిమ‌ల దేవాల‌య ప్ర‌వేశం మీద‌నే.

నిజంగానే అయ్య‌ప్ప అంటే అంత ప్రేమాభిమానాలు ఉంటే.. శ‌బ‌రిమ‌ల ద‌ర్శ‌నానికి ఉండే అర్హ‌త వ‌చ్చే వ‌ర‌కూ ఆగ‌టం త‌ప్పేం కాదు. దానికి కోర్టుకు వెళ్లాల్సిన అవ‌స‌రమే లేదు. న‌మ్మ‌కం లేనోళ్లు.. ఇప్ప‌టికే ఉన్న విధానాన్ని ఏదోలా బ్రేక్ చేయాల‌న్న త‌ప‌న త‌ప్పించి.. నిజంగా అయ్య‌ప్ప మీద అంత ఆరాధ‌న భావ‌మే ఉంటే.. క్షేత్ర న‌మ్మ‌కాన్ని దెబ్బ తీసేలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ప్ర‌శ్నను ప‌లువురు సంధిస్తున్నారు.

శ‌బ‌రిమ‌ల దేవాల‌య ప్ర‌వేశం అన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల‌కు క‌ల్పించాల‌ని కోరుతూ సుప్రీంలో పిటిష‌న్ వేయ‌టం.. అందుకు కోర్టు సానుకూలంగా స్పందించ‌టంపై కోట్లాది మంది అయ్య‌ప్ప భ‌క్తులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఆగ్ర‌హం చెందుతున్నారు. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. కొన్ని కోట్ల మంది ఒక విష‌యాన్ని త‌ప్ప‌ని స్ప‌ష్టం చేస్తున్న‌వేళ‌.. అందునా.. మ‌హిళ‌లే.. త‌మ‌కుండే న‌మ్మ‌కాల్ని వమ్ము చేయొద్దంటూ రోడ్ల మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేస్తున్న వైనం చూసిన త‌ర్వాత అయినా.. శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప ద‌ర్శ‌నం చేసుకోవాల‌న్న మొండిత‌నం అవ‌స‌ర‌మా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

అదేమంటే..సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమ‌లు చేయాల‌న్న మాట‌ను చెబుతున్నార‌ని అంటున్నారు. గ‌తంలో వివిధ అంశాల మీద సుప్రీం చాలానే ఆదేశాల్ని జారీ చేసింది. వాట‌న్నింటిని ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారా? అన్న ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో ప‌లువురి నోట వినిపిస్తోంది. అయినా.. కోట్లాది మంది న‌మ్మ‌కాల‌పై ఒక కోర్టు తీర్పు ఇవ్వ‌టం ఫైన‌ల్ ఎలా అవుతుంద‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్న వారు లేక‌పోలేదు. కోట్ల మంది స‌మూహం తీసుకునే నిర్ణ‌యంతోనే ప్ర‌భుత్వాలు.. వ్య‌వ‌స్థ‌లు ఏర్పాటు అవుతాయ‌ని.. అలాంట‌ప్పుడు అదే స‌మూహం త‌మ‌కు వ‌ద్ద‌న్న విష‌యంపై పున‌రాలోచ‌న చేయ‌టంలో త‌ప్పేంటి? అని ప్ర‌శ్నిస్తున్న వారు లేక‌పోలేదు.

అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకోవాల‌న్న ఆలోచ‌నే ముఖ్య‌మైతే.. ఎన్నో ఊళ్ల‌ల్లో ఉన్న అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యాల్ని సంద‌ర్శించుకుంటే స‌రిపోతుంది క‌దా. ఒక్క శ‌బ‌రిమ‌ల‌ను వ‌దిలేస్తే అస‌లీ ఇష్యూనే లేదుగా? అయినా..ఎందుకంత మొండిత‌నం?