పవన్ బీదపలుకుల్లో నిజమెంత?

Tue Mar 13 2018 15:28:23 GMT+0530 (IST)

నవ్యాంద్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ఖాజా టోల్ గేట్ కి సమీపంలో జాతీయ రహదారికి దగ్గర్లో పవన్ కళ్యాణ్ తన ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. 2 ఎకరాల సువిశాల స్థలంలో ఇల్లు నిర్మించేందుకు గాను సోమవారం ఉదయం పవన్ శంకుస్థాపన చేసి పునాదిరాయి వేశారు. ఆ తర్వాత జనసేన కార్యాలయానికి కూడా భూమి పూజ నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రెండు నిర్మాణాలు పూర్తయ్యేందుకు దాదాపుగా రూ.25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై  సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస డిజాస్టర్లతో సతమతమవుతోన్న పవన్ కు....ఇంత భారీ స్థాయిలో డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సర్దార్ గబ్బర్ సింగ్ - కాటమ రాయుడు - అజ్ఞాతవాసి.....ఇలా వరుస ప్లాపులతో పవన్ ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాడని టాక్ ఉంది. కొద్ది రోజుల క్రితం....ఈఎంఐ కట్టలేక తన కారు కూడా అమ్మేశానని పవన్ ఓ సందర్భంలో వెల్లడించారు. వరుస ప్లాప్ ల నేపథ్యంలో పవన్ కు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చని అంతా భావించారు. అయితే తాజాగా దాదాపు 25 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాలు చేపట్టడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మార్చి14న జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అనేక అంశాల గురించి పవన్ క్లారిటీ ఇస్తానన్నారని ఆ నిర్మాణాలకు అయ్యే ఖర్చుకు  డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో కూడా స్పష్టతనిస్తే బాగుంటుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వరుస ప్లాప్ లతో పవన్ ఆర్థికంగా చితికిపోయాడని బాధపడ్డామని కానీ ఆ నిర్మాణ కార్యక్రమాలు చూశాక తమకు బెంగ అవసరం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పవన్ బీదపలుకుల్లో నిజమెంత? అని వారు ప్రశ్నిస్తున్నారు.

పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తన మీద కక్ష్య కట్టి ఇన్ కం ట్యాక్స్ రైడ్ చేయించారని పవన్ ఆరోపించారని - కారుకు ఈఎమ్ ఐ కట్టలేని స్థితిలో ఇన్ కం ఉన్న పవన్ పై ఐటి దాడులు ఎలా చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతోకొంత డబ్బులేనిదే ఐటీ అధికారులు రైడ్ చేయరని కామెంట్స్ చేశారు. ఒకవేళ పవన్ పై కక్ష్య పూరితంగానే దాడులు చేశారనుకున్నా....మీడియాకు తన ఆస్తులు వెల్లడించడానికి పవన్ ఎందుకు భయపడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. నిజంగా తన దగ్గర ఆస్తులు ఆదాయం లేకుంటే...ఉన్న వివరాలను బహిరంగంగా వెల్లడించడానికి పవన్ కున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలన్నీ జనసేన`శతఘ్ని` బృందం సభ్యులు...పవన్ కు వినిపించారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. రేపు జరుగబోతోన్న సభలో పవన్...ఈ విషయాలపై కూడా క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి మరి.