Begin typing your search above and press return to search.

‘నేతి’పై వేటుకు రంగం సిద్ధమైందా?

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:16 AM GMT
‘నేతి’పై వేటుకు రంగం సిద్ధమైందా?
X
నరరూప రాక్షసుడైన నయింతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి వారంతా ఫలితం అనుభవిస్తున్న పరిస్థితి. తన దందాలతో దశాబ్దాల తరబడి నడిపించిన ఈ దుర్మార్గుడ్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం.. అనంతరం అతడు పాల్పడిన దుర్మార్గాలు.. దురాగతాలకు సంబంధించిన వివరాలు పెద్ద ఎత్తున బయటకు రావటంతో ప్రజలే కాదు.. పోలీసు అధికారులకు సైతం షాక్ తగిలే పరిస్థితి. నేరస్తుడైన నయింతో రాజకీయ నేతలు.. పోలీసు అధికారులు.. మీడియాకు చెందిన కొందరు ఇలా వ్యవస్థలో కీలకమైన రంగాలకు చెందిన అందరితో అతగాడికి లింకులు ఉండటం.. నయిం నెట్ వర్క్ ను చూసిన పోలీసు ఉన్నతాధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ని దారుణాలు చేసినా.. బయటకు రాకుండా మేనేజ్ చేయటమే కాదు.. తన ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండేలా ఇంతకాలం నయిం ఎలా నెట్టుకొచ్చారన్న అంశంపై పలువురు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇదిలా ఉంటే.. నయింతో లింకులున్న రాజకీయ నేతలు.. అధికారులతో సహా ఎవరెవరు అతడితో కుమ్మక్కు అయ్యారన్న విషయాన్ని సిట్ నిగ్గు తేల్చిన సంగతి తెలిసిందే.

నయింతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతల్లో తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతి విద్యాసాగర్ రావు పేరు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవిలో ఉన్న నేతిపై తీవ్ర ఆరోపణలతో పాటు.. నయింతో అతనికున్న సంబంధాలకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులు సేకరించిన నేపథ్యంలో.. ఆయనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నేతిపై వేటు వేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నయిం ఎపిసోడ్ విషయంలో.. అధికార.. విపక్షాలన్న వ్యత్యాసం లేకుండా అడ్డదారులు తొక్కిన అందరిని బుక్ చేయాలన్న విషయంపై ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నయింతో సంబంధాలు ఉన్న వారు తప్పించుకోకూడదన్న విషయాన్ని విచారణ అధికారులకు కేసీఆర్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అందుకే.. సొంత పార్టీకి చెందిన నేత.. కీలక స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. నేతిపై వేటుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ.. మండలి సమావేశాల సమయానికి నేతి మీద వేటు వేసే నిర్ణయాన్ని అమలు చేయటంతో పాటు.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై కేసీఆర్ ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. నేతి స్థానంలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావును కన్ఫర్మ్ చేసేందుకు దాదాపుగా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో అనుకోనిది ఏమైనా జరిగితే తప్ప.. ఈ ఎంపికలో మార్పు ఉండదన్న మాట వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/