Begin typing your search above and press return to search.

రోడ్డు మీదకొచ్చిన టిప్పు సుల్తాన్ వారసుడు

By:  Tupaki Desk   |   30 April 2016 5:17 AM GMT
రోడ్డు మీదకొచ్చిన టిప్పు సుల్తాన్ వారసుడు
X
రాజులు పోయారు. రాజరికాలు పోయాయి. కానీ.. వారికి సంబంధించిన గురుతులు మిగిలి ఉన్నాయి. తమ తాతల గొప్పతనాన్ని.. వారికున్న పేరుప్రఖ్యాతుల్ని ఎందుకు విడిచి పెట్టాలనుకున్నారో ఏమో కానీ.. కొందరు రాజవంశీకులు రాజకీయాల్లోకి రావటం తెలిసిందే. తాజాగా అలాంటి కోవకే చెందిన ఉదంతమిది. తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బయటకు వచ్చారు రాజవంశీకులు ఒకరు. టిప్పుసుల్తాన్ వంశానికి చెందిన వ్యక్తి చెప్పుకుంటున్న నజీర్ అహ్మద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

టిప్పు సుల్తాన్ 18వ వంశీక వారసుడిగా చెప్పుకుంటున్న అతగాడు చెన్నై విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాజరికాలు పోయినా.. తన రాజరికాన్ని ప్రదర్శించేందుకు మొహమాట పడలేదు. తమ ప్రయాణాలకు మహారాజులు వినియోగించే ఖరీదైన గుర్రపు బగ్గీని అందంగా అలంకరించి.. కత్తి పట్టిన అతగాడు ఎన్నిక ప్రచారానికి దిగాడు. నజీర్ తండ్రి జమాలుద్దీన్ సుల్తాన్ టైలరింగ్ పని చేస్తుండటం గమనార్హం

తమ నియోజకవర్గంలో 60 వేల మందికి పైగా ఇస్లాం మతస్తులు ఉంటే.. ఏ ఒక్క పార్టీ కూడా తమ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టలేదని చెబుతున్నారు. టిప్పు సుల్తాన్ వంశీకుడిగా ఓ రేంజ్ లో తన దర్పాన్ని ప్రదర్శించిన నజీర్.. తన ఆస్తుల గురించి వెల్లడిస్తూ.. తన పేరు మీద బ్యాంకులో రూ.30వేలు.. తన భార్యకు ఐదు సవర్ల బంగారం ఉన్నట్లు పేర్కొన్నాడు. రాజరిక దర్పం కంటే సింఫుల్ గా ప్రజల మనసుల్ని దోచుకోవచ్చుగా ‘సుల్తాన్’ సాబ్..?