Begin typing your search above and press return to search.

నాయినికి గల్ఫ్ లో అలాంటి పరిస్థితా?

By:  Tupaki Desk   |   20 Jan 2017 6:43 AM GMT
నాయినికి గల్ఫ్ లో అలాంటి పరిస్థితా?
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు విదేశీ పర్యటనలు చేస్తుంటే వారికి సంబంధించిన ఏర్పాట్లు ముందస్తుగా జరిగిపోతుంటాయి. ఇక.. అధికారిక పర్యటనల కోసం వెళితే.. ఏర్పాట్లు ముందస్తుగా పక్కాగా పూర్తి చేయటం ఉంటుంది. అందుకుభిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రికి ఎదురైంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వీసాల కోసం పలు కంపెనీలతో చర్చలు జరిపేందుకు వీలుగా గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఖతర్ చేరుకున్ననాయినికి విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం దోహాలో భారత రాయబారితో నాయిని సమావేశం కావాల్సి ఉంది. అయితే.. మంత్రి పర్యటనకు సంబంధించిన సమాచారం ముందస్తుగా తనకు లేదని.. ఇతర పనులు ఉండటంతో తాను కలవలేక పోతున్నట్లు భారత రాయబారి పేర్కొన్నారు. దీంతో.. షాక్ కు గురయ్యే పరిస్థితి. ఒక రాష్ట్ర హోంమంత్రి అధికారిక పర్యటన సందర్భంగా జరగాల్సిన ఏర్పాట్లకు భిన్నంగా.. జరగాల్సిన రీతిలో జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాయిని పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నా..అలాంటివి జరగలేదని చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికారులు కొందరు ఆయాదేశాల్లోని తెలంగాణ సంఘాల మీద ఆధారపడ్డారని.. వారితో ఏర్పాట్లు చేసేక్రమంలో జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ తో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇక్కడి తెలంగాణ సంఘాల మధ్యన ఉన్న అంతర్గత కలహాలతో..ఏర్పాట్లకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం... మొత్తంగాఅనుకున్న ఏర్పాట్లు జరగలేదని తెలుస్తోంది.

దీంతో కొన్ని కంపెనీల ప్రతినిధులతో మంత్రి నాయిని భేటీ కావాల్సి ఉన్నప్పటికీ..అక్కడి స్థానిక నిబంధనల ప్రకారం అది సాధ్యంకాలేదు. దీంతో.. కొన్ని మొక్కుబడికార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం అల్లుడితో కలిసి బయటకు వెళ్లినట్లుగాచెబుతున్నారు. ఒక రాష్ట్ర హోంమంత్రి విదేశీ పర్యటన సందర్భంగా జరగాల్సిన అధికారిక కార్యక్రమాలు జరగకపోవటానికి బాధ్యత ఎవరిదన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/