నీకు పుణ్యం ఉంటుంది నాయిని..రసం లెక్క చెప్పవా?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

అరే.. కేసీఆర్ ఎంత దోస్త్.. ఆ మాటకు వస్తే.. సారు పార్టీ మాదే. నాకిస్తానన్న పదవి నాకివ్వలేదంటూ తన అక్రోశాన్ని తనదైన రీతిలో వ్యక్తం చేసి వార్తల్లోకి వచ్చేశారు తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. పాతతరం నాయకుడైనప్పటికీ.. నేటితరం నేతలతో పోటీ పడుతూ.. మంట పుట్టే వ్యాఖ్యలతో తనలో ఇంకా జోరు తగ్గలేదన్నట్లు వ్యవహరిస్తుంటారు.ఇటీవల కాలంలో తమ బాస్ కేసీఆర్ చేపట్టిన  కేబినెట్ విస్తరణ నేపథ్యంలో.. పదవులు రాక గుర్రుగా ఉన్న గులాబీ నేతలు ఏ మాత్రం అవకాశం వచ్చినా.. మీడియా ముందు తమ కడుపులోని మంటను కక్కేస్తున్నారు. దీంతో.. ఎప్పుడూ లేని రీతిలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తనకు ఇస్తానన్న పదవిని కేసీఆర్ ఇవ్వలేదని.. పత్రికల్లో వస్తున్నట్లు తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇచ్చినా తాను తీసుకోనని తేల్చేసి సంచలనంగా మారారు నాయిని.

ఆర్టీసీ ఛైర్మన్ పదవి తనకొద్దనే క్రమంలో.. ఆ పోస్ట్ లో రసం లేదన్న మాటను మాట్లాడారు. నాయిని సాబ్.. ఇంతకీ రసం ఏమిటన్న మాటను ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు. చనువుగా మాట్లాడినా నాయిని కొన్నిసార్లు వచ్చే కోపానికి ఏం మాట్లాడతారో అన్న భయంతో కావొచ్చు.. చెప్పింది విని బుద్ధిగా రిపోర్ట్ చేశారే కానీ.. రసం ఏందన్నా? అన్న మాటను అడగలేదు.

నాయిని మాటలు పత్రికల్లో రావటం.. మంత్రి కేటీఆర్ లైన్లోకి వచ్చి.. ఆయన్ను పిలిపించుకొని మాట్లాడిన విషయాన్ని తాజాగా ఆయన చెప్పేశారు. కేటీఆర్ తనను పిలిచి అడిగితే.. తాన వివరణ ఇచ్చేశానని.. మీడియాతో తానేదో చిన్నగా చిట్ చాట్ చేస్తే పెద్ద వార్తగా వేశారని తాను చెప్పినట్లు చెప్పారు.

ఆర్టీసీ ఛైర్మన్ పదవిలో రసం లేదన్న ఆయన.. ఇప్పుడు అదే పదవి తనకిచ్చినా రసం వాళ్లే పోస్తారంటూ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడతానని చెప్పిన ఆయన.. టీఆర్ ఎస్ పార్టీ తమదేనని..అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయన్న కొత్త ధీమాను వ్యక్తం చేశారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. ఆ రసం మాటకు అర్థం చెప్పి పుణ్యం కట్టుకో నాయిని సాబ్?