Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కాలేలా నాయిని మాట్లాడారా?

By:  Tupaki Desk   |   8 Feb 2016 6:49 AM GMT
కేసీఆర్ కు కాలేలా నాయిని మాట్లాడారా?
X
ఆసక్తికర వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పెట్టింది పేరు. మనసుకు అనిపించింది కుల్లాగా చెప్పేసే ఆయన.. నర్మగర్భంగా మాట్లాడటం అన్నది అస్సలు తెలీదు. అనుకున్నది అనుకున్నట్లే కుండబద్ధలు కొట్టేసేలా మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయన అలానే మాట్లాడినప్పటికీ.. నాయిని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రహం కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ ఉద్యమం పేరెత్తే ప్రతిసారి మాజీ ముఖ్యమంత్రి.. దివంగత తెలంగాణ నేత మర్రిచెన్నారెడ్డి పేరు ప్రస్తావించటం.. ఆయన ద్రోహానికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయలేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేకనే రాజీ పడ్డారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. 1969 నాటి ఉద్యమనేత సూరి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో నాయిని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మర్రి చెన్నారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా వెళ్లిపోవటంతో గత్యంతరం లేకనే చెన్నారెడ్డి రాజీపడాల్సి వచ్చిందని.. 1969 నాటి ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నని చెప్పిన నాయిని.. మర్రిచెన్నారెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వటం గమనార్హం. మరి.. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ కు కోపం తెప్పించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పడు కేసీఆర్ ను గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.