Begin typing your search above and press return to search.

19 తర్వాత జగన్ ఇంటికి 'క్యూ'?

By:  Tupaki Desk   |   15 May 2019 2:30 PM GMT
19 తర్వాత జగన్ ఇంటికి క్యూ?
X
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడున విడుదల కాబోతూ ఉన్నాయి. అయితే అసలు కథ ఏమిటనేది అర్థం చేసుకోవడానికి మే ఇరవై మూడు వరకూ ఆగనక్కర్లేదు. మే పంతొమ్మిదిన ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతూ ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం ఐదు తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.

దేశమంతా పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఆ రోజుతో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవడానికి అన్ని మీడియా వర్గాలకూ అవకాశం ఉంది. ఇప్పటికే ఎప్పటికప్పుడు మీడియా వర్గాలు ఎగ్జిట్ పోల్ సర్వేలను చేయించుకున్నాయి. పోలింగ్ పూర్తి కావడంతో అవన్నీ విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎగ్జిట్ పోల్స్ వందకు వంద శాతం నిజం కాకపోయినా పొలిటికల్ ట్రెండ్స్ ను అయితే కచ్చితంగానే అవి అంచనా వేస్తాయి. జాతీయ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి మీడియా వరకూ ఎవరికి వారు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను వేశారు కూడా. ప్రీ పోల్ సర్వేలతో పాటు పోస్ట్ పోల్ సర్వేలు కూడా అవి చేసుకున్నాయి. అవన్నీ ఈ ఆదివారమే విడుదల కాబోతూ ఉన్నాయి.

మరి ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతోనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జాతీయ పార్టీలు శరవేగంగా స్పందించే అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలతో ఎవరిని కలిస్తే తమకు ఉపయోగం ఉంటుందనే లెక్కలతో ఆ పార్టీలు స్పందించే అవకాశం ఉంది.

ప్రత్యేకించి తటస్థంగా ఉన్న పార్టీల వారికి విలువ మరింత పెరుగుతుంది. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు జాతీయ పార్టీల నేతలు క్యూ కట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.

జగన్ ఏ కూటమికీ అనుకూలంగా లేరు. తను ఏ కూటమికి వ్యతిరేకం కాదు అని కూడా జగన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ వాళ్లు, ఇటు బీజేపీ వాళ్లు జగన్ ను సంప్రదించే అవకాశం ఉంది. ఆ పార్టీల ఢిల్లీ స్థాయి నేతలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాకా జగన్ ఇంటి ముందుకు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేంద్రంలో మద్దతు విషయంలో వారు జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇలా పంతొమ్మిదో తేదీ తర్వాత రసవత్తర రాజకీయం ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.