Begin typing your search above and press return to search.

కేసీఆర్.. దీదీ భేటీలో అంత సినిమా లేద‌ట‌

By:  Tupaki Desk   |   21 March 2018 6:07 AM GMT
కేసీఆర్.. దీదీ భేటీలో అంత సినిమా లేద‌ట‌
X
థ‌ర్డ్ ఫ్రంట్ కాదు.. మామే మొయిన్ ఫ్రంట్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలిసిందే. జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటుతున్న కేసీఆర్.. ఇటీవ‌ల కోల్ క‌తాకు వెళ్లి ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తాను చెబుతున్న బీజేపీ..కాంగ్రేసేత‌ర కూట‌మికి సంబంధించి ఒక కీల‌క అడుగు ప‌డింద‌ని.. అది కోల్ క‌తా వేదిక‌గా పురుడుపోసుకుంద‌న్న మాట‌తో పాటు.. కొన్ని అంశాల‌పై ఇరువురి మ‌ధ్య అంగీకారం కుదిరిన‌ట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దీనికి సంబంధించి తెలుగు మీడియాలో భారీ ఎత్తున వార్త‌లు అచ్చేశారు. కేసీఆర్ కోల్ క‌తా టూర్ స‌క్సెస్ అన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీదీ.. కేసీఆర్ ల మ‌ధ్య జ‌రిగిన మీటింగ్‌కు సంబంధించి ఒక ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మేకాదు.. కేసీఆర్ మాట‌ల‌పైనా.. తెలుగు మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పైనా సందేహాన్ని క‌లిగించేలా మారాయి.

ఎందుకిలా అంటే.. స‌ద‌రు మీడియా సంస్థ‌కున్న క్రెడిబులిటిగా చెప్పాలి. కోల్ క‌తాకు సంబంధించినంత‌వ‌ర‌కూ ఫేమ‌స్ మీడియా సంస్థ‌లు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్య‌మైన‌ది..అంద‌రూ ఎంతో విశ్వ‌సించే మీడియా సంస్థ‌గా ద టెలిగ్రాఫ్ కోల్ క‌తాను భావిస్తారు. ఈ మీడియా సంస్థ‌లో వార్త అంటే దానికుంటే విశ్వ‌స‌నీయ‌త‌.. ప్ర‌యారిటీ వేరుగా ఉంటుంది.

మమ‌త‌.. కేసీఆర్ భేటీకి సంబంధించి తెలుగు మీడియా సంస్థ‌ల‌న్నీ కూడా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అన‌ధికారికంగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగానే వార్త‌లు రాసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ్ కో వెళ్లిన ప్రైవేటు విమానంలో మీడియాను తీసుకెళ్ల‌లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. తెలుగు మీడియాలో ఒక్క ఈనాడుకు మిన‌హా మ‌రే మీడియా సంస్థ‌కు నెట్ వ‌ర్క్ లేదు. ఈనాడు అంటే రామోజీ మీడియా సంస్థ‌ల‌ని అర్థం. అయితే.. నెట్ వ‌ర్క్ ఉన్న‌ప్ప‌టికీ ఈ త‌ర‌హా వార్త‌ల విష‌యంలో కేసీఆర్ నుంచి వ‌చ్చే ప్రెస్ నోట్ కే ప్రాధాన్య‌త ఇస్తారు కానీ అక్క‌డి వారి వార్త‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ర‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. స‌ద‌రు టెలిగ్రాఫ్ ప‌త్రిక మ‌మ‌త‌.. కేసీఆర్ భేటీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య ఒక‌టి చేసింది. కేసీఆర్ చెప్పిన కూట‌మి మాట‌ల్ని సావ‌ధానంగా విన్నార‌ని..కానీ ఎలాంటి స్పంద‌నా ఇవ్వ‌లేద‌ని పేర్కొంది. ఇంకా వివ‌రంగా చెప్పాలంటే కామ్ గా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఓప‌క్క కేసీఆర్ ఏమో కీల‌క అడుగు కోల్ క‌తాలో ప‌డిన‌ట్లుగా చెబితే.. టెలిగ్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా దీదీ కామ్ గా ఉన్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రీ క‌థ‌నాన్ని టీఆర్ ఎస్ బాస్ ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం చ‌దివారా?