Begin typing your search above and press return to search.

24గంటల తర్వాత ట్రంప్ ప్రమాణం చేసిన చోట

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:21 AM GMT
24గంటల తర్వాత ట్రంప్ ప్రమాణం చేసిన చోట
X
కేవలం 24 గంటలు మాత్రమే గడిచాయి.అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికన్లు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. ట్రంప్ ఎక్కడైతే ప్రమాణస్వీకారం చేశారో.. సరిగ్గా అదే నేషనల్ మాల్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ట్రంప్ అభిమానుల కేరింతలతో శుక్రవారం మధ్యాహ్నం హడావుడిగా కనిపించిన నేషనల్ మాల్.. 24 గంటలు తిరిగేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు నేషనల్ మాల్ వద్దకు చేరుకొని ట్రంప్ కువ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

టీనేజీ కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ లక్షల్లో తరలివచ్చిన జన ప్రభంజనం ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ తమ అధ్యక్షుడు కానే కాదని ఎలుగెత్తిన వారు.. పుతిన్ పప్పెట్ గా నినదించారు. ఒబామా కేర్ చట్టాన్ని రక్షించాలని వారుడిమాండ్ చేశారు. ఈ భారీ ఆందోళనలో మహిళలు పెద్దఎత్తున పాల్గొనటం గమనార్హం.

ఈ ఆందోళనలో మహిళలతో పాటు.. అన్నివర్గాల ప్రజలు.. సినీ తారలు కూడా పాల్గొనటం గమనార్హం. మేక్ అమెరికా.. గ్రేట్ ఎగైన్ అనేది ట్రంప్ నినాదమైతే.. మేక్ అమెరికా.. థింక్ ఎగైన్ అంటూ ఆందోళనలో పాల్గొన్న మహిళలు నినదించటం గమనార్హం. ఇదే తరహా నిరసన ప్రదర్శనలు అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. మొత్తం 600 నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక.. షికాగాలో అయితే.. 50వేల మంది ఆందోళనకు వస్తారని భావిస్తే.. రెండున్నర లక్షల మంది రావటంతో పోలీసులు అనుమతుల్ని రద్దుచేశారు. అయినప్పటికీ ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ జరగటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా పలు నిరసనలు.. ఆందోళనలు చోటుచేసుకోవటం విశేషం. మొత్తంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్ కు 24 గంటల వ్యవధిలోనే ఇంత భారీగా నిరసనలు.. వ్యతిరేక ర్యాలీలు చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/