Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ ఉలికిపాటు..ఉగ్ర‌కుట్ర‌పై ఎన్ ఐఏ సోదాలు

By:  Tupaki Desk   |   20 April 2019 7:18 AM GMT
హైద‌రాబాద్ ఉలికిపాటు..ఉగ్ర‌కుట్ర‌పై ఎన్ ఐఏ సోదాలు
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం మ‌రోసారి ఉలిక్కిప‌డింది. ఉగ్ర క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో న‌గ‌ర శివారులోని మైలార్ దేవ్ ప‌ల్లిలోని ఎనిమిది ఇళ్ల‌ల్లో ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. త‌నిఖీల్లో భాగంగా తాహిర్ అనే యువ‌కుడ్ని భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి.

గ‌తంలో ఉగ్ర సందేహాల‌తో అరెస్ట్ చేసిన బాసిత్.. అబ్దుల్ ఖాదిర్ లు ఇచ్చిన స‌మాచారంతోనే తాజా సోదాలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. హైద‌రాబాద్‌ కు చెందిన బాసిత్.. ఐసిస్ సానుభూతిప‌రుడు. ఐసిస్ లో చేరేందుకు సిరియా.. పాకిస్థాన్ కు కూడా వెళ్లి వ‌చ్చాడు. అక్క‌డి వారి ఆదేశాల మేర‌కు ఢిల్లీకి చెందిన సంఘ్ ప‌రివార్ నేత‌ను చంపేందుకు ప్ర‌ణాళిక వేశారు.

త‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు న‌లుగురు యువ‌కుల‌ను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఇందులో భాగంగా ఏకే 47 తుపాకీల్ని స‌మ‌కూర్చారు. అయితే.. ఆ కుట్ర‌ను ఎన్ ఐఏ భ‌గ్నం చేసింది. బాసిత్ అరెస్ట్ నేప‌థ్యంలో కుట్ర‌కు సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పాక్ కు చెందిన యువ‌తితో బాసిత్ కు సంబంధాలు ఉన్న‌ట్లుగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలుస్తోంది. సోష‌ల్ మీడియా మాథ్య‌మంలో జ‌రిగిన సంభాష‌ణ‌ల‌కు అనుగుణంగానే న‌గ‌రంలో సోదాల్ని నిర్వ‌హిస్తున్నారు.

తాజాగా నిర్వ‌హించిన సోదాల్లో తాహిర్ ఇంటి నుంచి ఎన్ ఐఏ అధికారులు కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపింది. తాజాగా నిర్వ‌హిస్తున్న సోదాల్లో మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.