జూనియర్ ఎన్టీఆర్ మామ..అక్కడ నుంచి పోటీ?

Tue Feb 19 2019 13:33:09 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా బంధువు అవుతాడని అంటారు. ఆ బంధుత్వంతోనే చంద్రబాబు నాయుడు జూనియర్ కు నార్నె కూతురుతో సంబంధం సెట్ చేశాడని అంటారు. ఇందులో నిజం ఎంతో కానీ..  ఆ మేరకు ప్రచారం అయితే సాగుతూ ఉంటుంది.ఇక చాలా కాలం పాటు నార్నె శ్రీనివాసరావు చంద్రబాబుకు సన్నిహితుడిగానే మెలిగాడు. ఆయన పెట్టిన టీవీ చానల్ తెలుగుదేశం భజనే చేసేది. ఆ చానల్ సీఈవో కూడా కొంత కాలం పాటు లోకేష్ వ్యవహరించాడని అంటారు.

ఆ సంగతంతా అలా ఉంటే.. తాజాగా వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో నార్నె సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పుడు మరో ప్రచారం కూడా జరుగుతోంది. అదేమిటంటే.. నార్నె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేది.

గుంటూరు ఎంపీ  సీటుకు లేదా చిలకలూరి పేట ఎమ్మెల్యే సీటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నార్నె పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. నార్నె ఆస్తుల విషయంలో స్థితిమంతుడు కూడా. ఒకవేళ ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే.. అది సంచలనమే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చాలా వరకూ దూరం అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు పిల్లనిచ్చిన మామ వైసీపీ తరఫున రంగంలోకి దిగితే ఆ దూరం మరింతగా పెరిగినట్టే.

తన మామ పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఆ నియోజకవర్గం వరకూ అయినా ప్రచారం చేయవచ్చు. ప్రచారం చేసినా చేయకపోయినా తారక్ కు పిల్లనిచ్చిన మామ వైసీపీ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి అది  శరాఘాతమే అవుతుంది.