Begin typing your search above and press return to search.

మోడీకి క్లాస్ తీసుకుంటారట‌

By:  Tupaki Desk   |   29 Aug 2015 6:46 AM GMT
మోడీకి క్లాస్ తీసుకుంటారట‌
X
న‌రేంద్ర‌మోడీ... త‌న మాట‌కారిత‌నంతో భారత‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న నాయ‌కుడు. దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ఎంపిక‌యిన త‌ర్వాత వివిధ దేశాల్లో ఆయ‌న మాట‌తీరు, ప‌రిపాల‌న‌పై చ‌ర్చ జ‌రిగింది. అయితే అలాంటి మోడీకి ఇపుడు పాఠాలు నేర్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ట‌.

బీజేపీకి దిశానిర్దేశం చేసే రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్) త్వ‌ర‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీ స‌హా పలువురు సీనియర్ కేంద్రమంత్రులకు దిశానిర్దేశం చేయనుంది. వచ్చేనెల 2 నుంచి 4 వరకూ ఢిల్లీలో మూడు రోజులపాటు జరిగే సదస్సు ఆర్ ఎస్ ఎస్ పాఠాల‌కు వేదిక కానుంది. కీలకమైన బిహార్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో...ఆర్ ఎస్ ఎస్ ఈ సదస్సును ఏర్పాటు చేయటం విశేషం. దీంట్లో ఆ సంస్థకు చెందిన 39 అనుబంధ సంఘాల ఉన్నతస్థాయి నాయకులతోపాటు కేంద్రమంత్రులు కూడా హాజరవుతారు.

న‌రేంద్ర‌ మోడీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను అర్ ఎస్ ఎస్ అనుబంధ సంఘాల నేతలు ఈ సమావేశంలో వెల్లడిస్తారు. నిర్దేశిత సామాజికవర్గాలకు చేరువకావటానికి, హిందూత్వ- మైనార్టీ వ‌ర్గాల‌ ఎజెండాపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం, ఇత‌ర‌త్రా కార్యక్ర‌మాలతో ముందుకు తీసుకెళ్లటానికి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి.... ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న అంశాలపై ఈ సమావేశంలో మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.