Begin typing your search above and press return to search.

పార్టీ ఎంపీల‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   12 Aug 2017 4:48 AM GMT
పార్టీ ఎంపీల‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన మోడీ
X
ప్ర‌ధాని మోడీ పేరు వింటే చాలు విపక్షాలు వ‌ణికిపోతున్న ప‌రిస్థితి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దిమ్మ తిరిగిపోయేలా వ‌రుస షాకులిస్తున్న ఆయ‌న తీరుతో బెదిరిపోతున్నారు. ఎప్పుడేం చేస్తారో తెలీటం లేద‌ని.. ఏ విధంగా దెబ్బేస్తారో కూడా అర్థం కావ‌టం లేద‌న్న వాద‌న‌ను ప‌లు రాజ‌కీయ పార్టీలు వ్య‌క్తం చేస్తున్నాయి. విప‌క్షాల్ని ఇంత‌గా వినిపిస్తున్న మోడీ.. స్వ‌ప‌క్షం ఎంపీలు మాత్రం లైట్ అంటే లైట్ అంటున్నార‌ట‌.

పార్ల‌మెంటుకు హాజ‌రు కావాల‌ని.. త‌ప్ప‌నిస‌రిగా స‌మావేశాల్లో పాల్గొనాలంటూ త‌మ పార్టీ ఎంపీల‌కు మోడీ ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. వారు మాత్రం ఆయ‌న మాట‌ను అస్స‌లు విన‌టం లేద‌ని చెబుతున్నారు. మొన్న‌టికి మొన్న ఓబీసీ బిల్లును రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన‌ప్పుడు.. పార్టీకి చెందిన నేత‌లు స‌భ‌లో లేక‌పోవ‌టంతో కాంగ్రెస్ సూచించిన సూచ‌న‌ల్ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని బిల్లును పాస్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

సొంత పార్టీ ఎంపీల తీరుపై ప్ర‌ధాని మోడీ సీరియ‌స్ గా ఉన్నారు. స‌భ‌కు స‌రిగా హాజ‌రు కాని ఎంపీల మీద ఆయ‌న తాజాగా తీవ్రంగా మండిప‌డ్డారు. పార్టీ పార్ల‌మెంటు స‌భ్యుల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన సంద‌ర్భంగా స‌హ‌చ‌రుల‌పై కారాలు.. మిరియాలు నూరిన‌ట్లుగా చెబుతున్నారు. స‌భ‌కు హాజ‌రు కాకుండా.. సంత‌కం చేసి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవ‌టానికి మిమ్మ‌ల్ని ఎంపీల‌ను చేశామా? పార్టీకి సేవ చేసినోళ్లు చాలామందే ఉన్నార‌ని.. అలాంటి వారిని కాద‌ని కోరి మ‌రీ సీట్లు కేటాయించి టికెట్లు ఇస్తే పార్ల‌మెంటుకు స‌రిగా రారా? అంటూ తీవ్ర స్వ‌రంతో ప్ర‌శ్నించిన‌ట్లు చెబుతున్నారు. ఎంపీలు త‌మ తీరును మార్చుకోకుంటే క‌ఠిన చ‌ర్య‌లు ఉండ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే 2019 ఎన్నిక‌ల వేళ‌లో త‌మ‌కు తోచిన‌ట్లు సీట్లు కేటాయించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని స‌భాముఖంగా మోడీ తేల్చి చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎంపీల తీరు మార్చుకోకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న ఆయ‌న మాట‌లు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గ‌తంలో ఇదే త‌ర‌హాలో మోడీ మాట్లాడిన‌ప్ప‌టికీ.. ఎప్పుడూ కూడా టికెట్ల కేటాయింపు మాట‌ను నేరుగా ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. అందుకు భిన్నంగా ఈసారి మాట్లాడ‌టం చ‌ర్చ‌గా మారింది. ఓబీసీ బిల్లును రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన స‌మ‌యంలో సీనియ‌ర్ మంత్రుల‌తో స‌హా బీజేపీకి చెందిన 31 మంది స‌భ్యులు గైర్హాజ‌రు అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు బాగా చేస్తున్నా.. స‌భ‌కు హాజ‌రు కాక‌పోవ‌టాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని మోడీ స్ప‌ష్టం చేయ‌టంపై పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ స‌భ హాజ‌రు విష‌యంలో పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన నేత‌ల‌కు.. మోడీ తాజా వార్నింగ్ ఇప్పుడు ద‌డ పుట్టిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఈ ద‌డ తాత్కాలిక‌మా? దీర్ఘ‌కాలం ఉంటుందా? అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.