Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ - జ‌గ‌న్‌ ను మోడీ ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   18 Jun 2018 11:34 AM GMT
కేసీఆర్‌ - జ‌గ‌న్‌ ను మోడీ ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందే
X
ఇప్ప‌టికే వ‌రుస ఉప ఎన్నిక‌ల ఓట‌మితో ఒకింత ఆందోళ‌న‌క‌ర‌మైన స్థితిలో ఉన్న బీజేపీకి మ‌రో షాకింగ్ ట్విస్ట్ ఎదురుకానుంది. త్వరలో రానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నేత‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌నున్నాయి. ప్ర‌స్తుత డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో...తిరిగి ఆ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డం బీజేపీకి గ‌ట్టి స‌వాల్ కానుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికయ్యే అభ్యర్థికి 122 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఏఐఏడీఎంకేను కలుపుకున్నా బీజేపీ బలం 106కు మించదు. దీంతో చిన్న‌పార్టీ ల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిసరికానుంది.

ప్రస్తుత డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ ఎన్నిక జరుగనుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ గా ఎన్నికయ్యేందుకు 122 సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి 67 మంది సభ్యులు - కాంగ్రెస్‌ కు 51 మంది - బీజేడీకి 9 మంది సభ్యుల బలముంది. ఈ క్ర‌మంలో ప్రాంతీయ పార్టీలైన టీఆర్ ఎస్ - వైసీపీ - బీజేడీ సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. రాజ్యసభలో బీజేడీకి తొమ్మిది మంది - టీఆర్ ఎస్‌ కు ఆరుగురు - వైసీపీ ఇద్దరు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ - బీజేపీలకు సమదూరం పాటించే ఈ మూడు పార్టీలకు 17 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ప్రధానపక్షాలు ఈ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలక ఎన్డీఏ కూటమితోపాటు ప్రతిపక్షాలు టీఆర్ ఎస్ సహా ఇతర తటస్థ పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తున్నాయి. అధికార ఎన్డీఏ బ‌లం 106 కాగా - ఇటీవల ఎన్డీఏ నుంచి బటయటకు వచ్చిన టీడీపీని కలుపుకున్నా మొత్తం ప్రతిపక్షాల బలం 117 మాత్రమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు తీసుకుని కాంగ్రెసేతర పార్టీకి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియన్ పలు పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరుపుతున్నారు.

సంపద్రాయబద్దంగా అయితే లోక్‌సభ స్పీకర్‌ - రాజ్యసభ చైర్మన్‌ పదవులను అధికార పక్షానికి చెందిన వ్యక్తులు - డిప్యూటీ స్పీకర్‌ - డిప్యూటీ చైర్మన్‌ పదవులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల నిర్వహిస్తారు. అయితే, రెండు పదవులను తమ వద్దే ఉంచుకునేందుకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించింది. దీంతో ఎన్డీయే కూడా అలానే చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ - బీజేపీ యేతర వ్యక్తికే డిప్యూటీ చైర్మన్‌ గా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.