Begin typing your search above and press return to search.

ఎంపీల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   21 March 2017 5:28 PM GMT
ఎంపీల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన మోడీ
X
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ త‌న పార్టీ ఎంపీల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలంద‌రితో క‌లిసి స‌మావేశం ఏర్పాటు చేసిన మోడీ కోర‌మ్ లేక పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాలు స‌జావుగా సాగ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎంపీలంతా క‌చ్చితంగా స‌భ‌కు హాజ‌రు కావాల‌ని, తాను ఏ స‌మ‌యంలోనైనా పిలుస్తాన‌ని మోడీ స్ప‌ష్టం చేశారు. పార్ల‌మెంట్‌కు రావ‌డం ఎంపీల ప్రాథ‌మిక బాధ్య‌త అని, తాను ఎన్ని ప‌నులు చేసినా ఎంపీల త‌ర‌ఫున హాజ‌రు కాలేను క‌దా అని పార్ల‌మెంట్‌కు డుమ్మా కొడుతున్న బీజేపీ ఎంపీల‌కు చుర‌క‌లు అంటించారు.

రెండు స‌భ‌ల్లోనూ కోర‌మ్ లేద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ప్ర‌ధాన‌మంత్రికి ఫిర్యాదు చేయ‌డంతో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీలు రావాల‌ని కోర‌డం ఏంట‌ని, అది వారి ప్రాథ‌మిక విధి అని మోడీ తేల్చిచెప్పారు. స‌భ్యులు వ‌చ్చి పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో కూర్చోవ‌డం కాదు.. స‌భ‌ల‌కు హాజ‌రు కావాల‌ని మోడీ చెప్పినట్లు బీజేపీ స‌భ్యులు తెలిపారు. కాగా, గ‌తంలోనూ ఎంపీలంతా రావాల‌ని మోదీ చెప్పినా.. ఈసారి మాత్రం కాస్త వివ‌రంగా, క‌ఠినంగా స‌భ్యుల‌కు ఆదేశాలు జారీచేశార‌ని స‌మాచారం. ఆరెస్సెస్‌లోనూ స‌భ్యులు చాలా ప‌నుల‌తో బిజీగా ఉండి శాఖకు వ‌చ్చే వారు కాద‌ని, ఎంపీలు కూడా అదే కార‌ణం చెప్పి స‌భ‌కు రాక‌పోవ‌డం స‌రికాద‌ని మోడీ అన్న‌ట్లు బీజేపీ స‌భ్యులు చెప్పారు.