ప్రియాంక వాద్రాకు మోడీ భయపడుతున్నారా?

Mon Apr 15 2019 22:20:08 GMT+0530 (IST)

ఈ ఎన్నికల ముందు తమ అంతిమ అస్త్రాన్ని ప్రయోగించేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ తో చేత కాదు అనే అభిప్రాయాన్ని పోగొట్టలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. ప్రియాంకను రామబాణంగా వాడుతూ ఉంది. రాహుల్ అద్భుతాలు చేయగలడు అనే నమ్మకాన్ని కలిగించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రియాంక తో మాత్రం అద్భుతాలే అనే అంచనాలను ఏర్పరచగలిగింది. ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉన్నారు.అసలు కథ ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఊరికే రంగంలోకి దిగడం కాదు.. ఏకంగా మోడీ మీద పోటీకి సై అని అంటున్నారు ప్రియాంక. వారణాసిలో మోడీ మీద నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రియాంక రెడీ అవుతున్నారట. మోడీ మీద ప్రియాంకను పోటీ చేయించి అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉంది.

ఈ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పందించేశారు. ఇక రాహుల్ ఆదేశమే మిగిలి ఉందట. తన  అన్న ఆదేశిస్తే మోడీ మీద పోటీకి సై అని ప్రియాంక అంటున్నారట. మోడీ వర్సెస్ ప్రియాంక ఎన్నికల పోరాటమే జరిగితే.. అంతకన్నా ఆసక్తిదాయకమైన పోరు ఈ ఎన్నికల్లో ఉండనే ఉండదు. అయితే అది జరుగుతుందా అనేది ఇంకా సందేహమే.

ఆ సంగతలా ఉంటే.. ప్రియాంక అనూహ్యంగా తనపై ఎన్నికల బరిలోకి దిగితే.. అనే అంశం గురించి మోడీ కూడా ఆలోచనలో పడిపోయారట. ప్రియాంక మరీ తక్కువ అంచనా వేయదగిన ప్రత్యర్థి కాదు అనే విషయం మోడీకి తెలియనిది కాదు. మోడీ ఛరిష్మా ఏమీ తక్కువ కాదు కానీ అలాగని ప్రియాంక కూడా తక్కువ కానే కాదు. అందులోనూ మోడీపై ప్రియాంక రంగంలోకి దిగితే ఎస్పీ బీఎస్పీ వంటి పార్టీలన్నీ కూడా ఆమెకే మద్దతు ప్రకటించేసి తప్పుకుంటాయి.

అందుకే మోడీ కూడా ఇప్పుడు తన జాగ్రత్తల్లో తను ఉన్నారట. వారణాసితో పాటు మరో నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి మోడీ రెడీ అవుతున్నారట. ఎటు పోయి ఎటొస్తుందో అనే భయంతో మోడీ.. ఈ సారి కూడా వారణాసి తో పాటు మరో నియోజకవర్గంలో కూడా నామినేషన్ వేయడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఒక చోట గట్టి ప్రత్యర్థితో పోరాడుతూ.. మరో సేష్ జోన్లో మోడీ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం!